16 నెలల పెండింగ్‌ వేతనాలివ్వాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ప్రకతి వ్యవ సాయ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 16 నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ లోని ఎ.పి.కమ్యూనిటీ నాచురల్‌ పార్మింగ్‌ విభాగంలో ఐసిఆర్‌పి, ఎల్‌ 1, ఎల్‌ 2, మాస్టర్‌ ట్రైనర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వాలు అతి తక్కువ వేతనాలతో పని చేయించుకోవడమే గాక గత 16 నెలలుగా చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం వలన దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనేక రకాలుగా బటన్‌లు నొక్కి అన్ని రంగాల వారికీ డబ్బులు విడుదల చేస్తున్న ప్రభుత్వం వీరికి జీతం ఇకపోవడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక అప్పుల బారిన పడిన వీరికి వెంటనే పెండింగ్‌ వేతనాలిచ్చి అప్పుల నుండి కాపాడాలని చెప్పారు. పెండింగ్‌ వేతనాల కోసం, సకాలంలో వేతనాలిచ్చి ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాల కొరకు భవిష్యత్‌లో సిఐటియు ఆధ్వర్యాన పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎ.వి.రమణ, జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.ఫయాజ్‌ పాల్గొన్నారు.

➡️