27 నుండి గుంటూరు కళాపరిషత్‌ నాటకోత్సవాలు

Jan 25,2024 00:32

వివరాలు వెల్లడిస్తున్న మల్లికార్జునరావు, నాయుడుగోపి తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
గుంటూరు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 26వ వార్షిక నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్‌ అధ్యక్షులు పి.వి.మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవాల వివరాలు వెల్లడించారు. మూడ్రోజులపాటు ప్రతి రోజూ 3 చొప్పున మొత్తం 9 నాటికలు ప్రదర్శించబడతాయన్నారు. సమయ పాలనకు పెట్టింది పేరైన గుంటూరు కళాపరిషత్‌ ఈ ఏడాది ప్రతి రోజూ సాయంత్రం 6.15 గంటలకు ప్రదర్శనలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 1997లో కళ ప్రజల కోసం అనే స్ఫూర్తితో గుంటూరు కళాపరిషత్‌ ఏర్పాటు చేసి, 25 ఏళ్లుగా నాటకోత్సవాలు నిర్వహిస్తూ, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసిందని, ఈ ఏడాది కూడా పేరొందిన నాటికలను ప్రదర్శించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కావున కళాభిమానులు, నగర ప్రజలు ఈ నాటికలను ఆదరించాలని కోరారు. సమావేశంలో కళాపరిషత్‌ గౌరవాధ్యక్షులు వి.తాండవకృష్ణ, ఎ.శివ, పి.శివరామకృష్ణ, షేక్‌ సైదా, ఎ.సుబ్బారావు, ఆర్‌.ఆంజిబాబు పాల్గొన్నారు.

➡️