5 లక్షల మందితో యువగళం సభ

Dec 17,2023 21:01

ప్రజాశక్తి-భోగాపురం  :  నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మండలంలోని పోలిపల్లి సమీపంలో చేపడుతున్న యువగళం ముగింపు సభ ఏర్పాట్లను మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సభలో తీసుకునే నిర్ణయాలతో పార్టీకి జరిగే మేలు కంటే రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రులకు జరిగే ప్రయోజనాలే ఎక్కువని చెప్పారు. సభకు కార్యకర్తలను తరలించేందుకు బస్సులను ఆర్‌టిసి ఎమ్‌డిని అడిగితే ఇవ్వలేదని తెలిపారు. దీంతో ప్రయివేట్‌ బస్సుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సభకు ఐదు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టిడిపి నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌ఛార్జి దామచర్ల సత్య, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, ఇచ్ఛాపురం పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, భోగాపురం మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️