7న గుంటూరులో ఇండియా ఫోరం సభ

Mar 5,2024 00:17

ఐక్యతా అభివాదం చేస్తున్న వివిధ పార్టీలు, సంఘాల నాయకులు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
ఇండియా ఫోరం ఆధ్వర్యంలో న్యాయ సాధన సభ మార్చి 7న గుంటూరు పెదకాకాని రోడ్డులోని సులేమాన్‌ ఖాన్‌ కంపెనీ మైదానంలో జరుగుతుందని కాంగ్రెస్‌, వామప క్షాల నాయకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్లకు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరు కుమార్‌, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్‌ సేవా కుమార్‌, తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షులు సత్యరెడ్డి, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా నాయకులు లోకం భాస్కర్‌రావు, భారత్‌ బచావో నాయకులు కోల నవజ్యోతి మాట్లాడారు. కేంద్రంలో మతోన్మాద నరేంద్ర మోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నరహంతక ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలన్నారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన అధినేతలు నిత్యం నరేంద్ర మోడీకి జపం చేస్తూ రాష్టానికి తీరని అన్యాయం చేస్తున్నారని, ఈ మూడు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సభకు కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు, పలు రాజకీయ పార్టీల, ప్రజాసంఘల రాష్ట్ర నాయకులు హజరవుతారని చెప్పారు. మేధావులు, కార్మికు లు, రైతులు, అన్ని రంగాల ప్రజలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్‌, వివిధ సంఘాల నాయకులు అరుణ్‌ కుమార్‌, హనుమంతరావు, చైతన్య, బి.వెంకటే శ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కరీం పాల్గొన్నారు.

➡️