7లోగా అభివృద్ధి పనులు ప్రారంభించాలి

Feb 26,2024 20:48

ప్రజాశక్తి- మెరకముడిదాం :అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. మార్చి 7వ తేదీలోగా ప్రారంభోత్సవాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదాం మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. రీసర్వే, గృహనిర్మాణం, రహదారులు, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, డ్వామా, రెవెన్యూ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను, పనుల పురోగతని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, నాడూ-నేడు, గడప గడపకు, ఉపాధిహామీ కన్వర్జెన్సీ తదితర పనులు కోడ్‌తో సంబంధం లేదని అన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న పనులు కొనసాగుతాయని, కొత్తవి మాత్రం ప్రారంభించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ అధికారులంతా ఎప్పటిలాగే సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసి ప్రస్తుతం జరుగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి, 7వ తేదీలోగా ప్రారంభించాలని మంత్రి కోరారు. రెండు మూడు రోజుల్లో నాడు-నేడు పనుల బిల్లులు మంజూరు కానున్నాయని, పూర్తయిన పనుల బిల్లులను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అన్ని రకాల అభివృద్ది పనుల బిల్లులనూ మరోవారం పదిరోజుల్లో పూర్తిగా చెల్లించడం జరుగుతుందని, అధికారులు అలసత్వం చూపించకుండా ఎప్పటికప్పుడు బిల్లులు ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటింటి నీటి సరఫరాను మెరుగు పరచాలని సూచించారు. అర్హత ఉన్న వారి అసైన్డ్‌ భూములకు మాత్రమే పూర్తి హక్కులను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అసైన్డ్‌ పట్టా కలిగి ఉండి, భూమి వారి ఆధీనంలో ఉన్నవారికి మాత్రమే ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కులు కల్పిస్తామన్నారు. అలాంటి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే, తహశీల్దార్‌, ఆర్‌డిఒలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి భూ సమస్యలు ఏమైనా ఉంటే మార్చి 5లోగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. గర్బాం, శాతాంవలస ఆధార్‌ కేంద్రాలను వెంటనే పునరుద్దరించాలన్నారు. కస్తూరిభా పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిఏసిఎస్‌ అధికారులు తాము అమ్మిన ఎరువుల సొమ్మును 48 గంటల్లోగా ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. అనధికార వ్యక్తులచేత ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించవద్దని, ఇలాంటివి తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారి సేవలు అవసరం అనుకుంటే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, ఆర్‌డిఒ బి.శాంతి, ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, తహశీల్దార్‌ వైవి పద్మావతి, ఎంపిడిఒ ఎం.పావని, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, బొత్స సందీప్‌, రమణరాజు, కెఎస్‌ఆర్‌కె ప్రసాద్‌, కె.విశ్వేశ్వర్రావు, తాడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి చేతులమీదుగా పేదలకు పట్టాలను పంపిణీ చేశారు.గుర్ల: మండలంలోని గరికివలస గ్రామంలో సచివాలయం, వెల్‌నెస్‌, ఆర్‌బికెలను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయన్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపిపి ప్రమీల, జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు, సర్పంచ్‌ బెల్లాన సన్యాసమ్మ, డిఎల్‌డిఎ చైర్మన్‌ బెల్లాన బంగారునాయుడు, వైసిపి మండల అధ్యక్షులు జమ్ము స్వామినాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️