రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం పట్ల అనుసరి స్తున్న విధానాల వలన నేడు చేనేత కార్మికులు కనీస జీవనం కొనసాగించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు మురుగుడు సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేసేపల్లి గ్రామానికి చెందిన నాగానందం(44) అనే చేనేత కార్మికుడు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈయన కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూలు, రంగులు, రసాయనాలపై విధించిన జీఎస్టీ వలన నేడు వస్త్రాలు అమ్ముడుపోక నిల్వలు పేరుకుపోయి వస్త్ర తయారీకి చేసిన అప్పులు తీర్చలేక కార్మికులు నాన్న అవస్థలు పడుతూ ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రభుత్వం యార్న్‌ సబ్సిడీ, త్రి ఫండ్‌, పావలా వడ్డీ, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలు కూడా ఎత్తివేయడంతో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలను మార్పుచేసి కార్మికుల ఉపాధికి తగిన చర్యలు తీసుకొని చేనేత రంగ పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు బట్టు నాగమల్లేశ్వరరావు, ఆకురాతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️