పల్నాట.. చుక్క నీటికి కటకట..

Apr 7,2024 00:15

మాచర్ల మండలంలో మోటారు నుంచి పొగలు రావటంతో తనిఖీ చేస్తున్న మహిళ
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
పల్నాడు ప్రాంతం తాగునీటి సమస్యలతో విలవిల్లాడుతోంది. గతేడాదికి మించి ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గురజాల నియోజకవర్గంలోని సూమారుగా పదికిపైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడితో ప్రజల గొంతెండుతోంది. చెంతనే కృష్ణా నది ఉన్నా దాహం తీరడం లేదు. ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా ఏళ్ల తరబడి ఎన్నికల హామీలకే పరిమితమవుతోంది. పల్నాడు జిల్లాలో ప్రతి వేసవిలో భూగర్భ జలాలు సుమారుగా 9 మీటర్ల వరకు అడుగుంటిపోయేవి. కాని ఈ ఏడాది సుమారుగా 16మీటర్ల వరకు భూగర్భ జలాలు అడుగంటి పోయాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల్లేకపోవడం, నదులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గురజాల నియోజకవర్గంలో ఉన్న 76 గ్రామాల్లో సుమారుగా 15 గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన పవర్‌ బోర్ల సైతం అడుగంటాయి. కొన్ని ప్రాంతాల్లో మహిళలు నీళ్ళు లేకపోవడంతో కాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువుగా గుత్తికొండ, చెన్నాయిపాలెం, పిలుట్ల, కేశానుపల్లి, గామాలపాడు, తకెళ్ళపాడు, శ్రీనివాసపురం, తంగెడ, దైద, తేలుకుట్ల, సమాధానంపేట తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. దాచేపల్లిలో సమస్య మరింత ఎక్కువుగా ఉందని, బోర్లు అడుగుంటాయని స్థానికులు వాపోతున్నారు. గత నెల5వ తేదీన నాగార్జున సాగర్‌ నుండి తాగునీటి కోసం నీటిని విడుదల చేసినా అనుకునంత మేర నీరు రాకపోవడంతో చెరువులు నిండలేదని జనం చెబుతున్నారు. గురజాల నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 800 పవర్‌ బోర్లు ఉండగా అందులో 100కి పైగా భూగర్భ జలాలు అడుగుంటిపోవడంతో నిరుపయోగంగా మారాయి. 948 చేతి పంపులు ఉండగా అందులో 565 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని. మిగిలిన 383 చేతి పంపులు పాడయ్యాయి. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా కొంత వరకు సరఫరా చేస్తున్నారు. 2019 ఎన్నికల హామీలలో భాగంగా బుగ్గవాగు రిజర్వాయర్‌ నుండి గ్రావిటి ద్వారా పల్నాడు జిల్లాలో 6 నియోజకవర్గాలకు కృష్ణానది నీటిని సరఫరా చేసేందుకు వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా పనులు మొదలు కాలేదు. వాటర్‌ గ్రిడ్‌ పూర్తయితే నీటి సమస్య పూర్తిగా తీరుతుందని అధికారులు అంటున్నారు.

దూరం నుండి బిందెతో నీరు మోస్తున్న యువకుడు
ప్రజాశక్తి-మాచర్ల రూరల్‌
  : మాచర్ల మండలంలోని పలుగ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండే కాలనీలు, గ్రామాలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వం వేసిన బోర్లు అరకొరగా పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల వాడుకోవాటానికి ఉప్పునీరు ఉందికానీ, తాగునీరు లేదు. దీంతో కొందరు కలిసి అధికంగా డబ్బు వెచ్చించి సొంతంగా బోర్లు వేయించకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీరు పడాలంటే 500 నుంచి 1000 అడుగులు లోతులో బోర్లు వేయాల్సి వస్తోంది. మండలంలోని కొత్తపల్లి ఎస్సీ కాలనీలో వాడుకోవటానికి ఉప్పునీరు సరఫరా అవుతున్నాయి. వీరు తాగునీరు కోసం దూరం నుంచి తెచ్చుకోవాలి లేదా 20 లీటర్ల నీరు రూ.20కు కొనాలి. చెరువులో ఒక బోరు వేసి, తాగునీటిని సరఫరా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ద్వారకాపురిలో ఎండలు ముదిరితే బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది. రేగులవరం తండాలో 300 ఇళ్లకు రెండు ప్రభుత్వ బోర్లుండగా, ఒకబోరు పనిచేయటం లేదు. రెండవ బోరు నుండి వస్తున్న నీరూ అరకొరే. గ్రామంలోని కొందరు 10 ఇళ్లకు కలిపి ఒక బోరును సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. అలా మూడు బోర్లు సొంతబోర్లు వేసుకున్నారు. ఒక్కో బోరుకు రూ.2 లక్షలు ఖర్చయినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామానికి తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్థులు వాంకడావత్‌ గబ్బర్‌సింగ్‌, హాంజీ, వడితే అంబాలి, రమావత్‌ సంకూ, బిక్కి, బుజ్జిలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లచ్చంబావి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది. పొలాల్లోని 100 బోర్లలో 10 మాత్రమే పని చేస్తున్నాయి. పశువులు కూడా నీరు దొరక్క అవస్థ పడుతున్నామని లోడంగి లింగయ్య, నర్సమ్మలు తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమ తాగునీటి అవసరాలు తీర్చాలని, ట్యాంకర్ల ద్వారా అయినా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రైతుల బోర్లు అద్దెకు తీసుకుంటాం… ఆర్‌డబ్ల్యూఎస్‌ డిఇ వెంకట్రావు
వేసవిలో నీటిని పొదుపుగా వాడుకుంటూ వృథాను అరికట్టాలి. నీటి సమస్య అధికంగా ఉన్న గ్రామాల్లో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సోమవారం నుండి సాగర్‌ నీటిని తాగునీటి కోసం విడుదలవుతాయి. నియోజకవర్గంలోని అన్ని చెరువులను పూర్తి స్ధాయిలో నింపుతాం. దీని వల్ల గ్రామాల్లో భూగర్భ జలాల మట్టమూ పెరుగుతుంది. పొలాలు ఖాళీగా ఉన్న దృష్ట్యా అందులో ఉన్న బోర్లును అద్దె ప్రాతిపదికన యజమానులు దగ్గర నుండి తీసుకోని వాటి ద్వారా కూడా నీరు సరఫరా చేస్తాం అందుకుగాను బోరు యజమానికి నెలకు రూ.9850 ప్రభుత్వం చెల్లిస్తుంది.

➡️