ప్రణాళిక బద్ధంగా ఇవిఎం పంపిణీ ప్రక్రియ

ప్రజాశక్తి-రైల్వేకోడూరు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళిక బద్ధంగా ఇవిఎంల పంపిణీ, రిసెప్షన్‌ ప్రక్రియలను నిర్వహించాలని కలెక్టర్‌, అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ కోడూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కోడూరు మండలం అనంతరాజుపేటలోని ఉద్యానవన యూనివర్సిటీలో నియోజకవర్గానికి సంబంధించి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఇంటర్మీడియట్‌ స్ట్రాంగ్‌ రూములను ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్ని స్ట్రాంగ్‌ రూములు ఉన్నాయి, పార్లమెంట్‌, అసెంబ్లీకి సంబంధించి స్ట్రాంగ్‌ రూమ్‌లో పిఎస్‌ నెంబర్లు వేశారా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు స్ట్రాంగ్‌ రూములో అన్ని ఏర్పాటు పూర్తి చేశారా లేదా తదితర అంశాలపై కోడూరు రిటర్నింగ్‌ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజక వర్గానికి సంబంధించి పార్లమెంట్‌, అసెంబ్లీకి విడివిడిగా పిఎస్‌ వారీగా మూడు స్ట్రాంగ్‌ రూములలో ఇవిఎంలను భద్రపరచడం జరుగుతుందని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి మరొక గదిని కూడా సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు రిటర్నింగ్‌ అధికారి లీలారాణి జిల్లా ఎన్నికల అధికారికి వివరించారు. అనంతరం వాహనాల పార్కింగ్‌ ప్రదేశాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌ విధులకు వచ్చిన అధికారులు సిబ్బంది వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేస్తారు, పోలింగ్‌ కేంద్రాలకు తరలించాల్సిన బస్సులను ఏ విధంగా పార్కింగ్‌ చేస్తారు, బస్సులు లోపలికి వచ్చేటప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా పోలీస్‌ శాఖతో తగ్గిన విధంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రం రూట్‌ మ్యాపులు, వాహనాల పార్కింగ్‌ పక్కాగా రూపొందించుకోవాలని పేర్కొన్నారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఎస్‌పి బి.కృష్ణారావు పోలీస్‌ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. పోలింగ్‌ అనంతరం స్ట్రాంగ్‌ రూముకు తీసుకువచ్చిన ఇవిఎంలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా స్వీకరించి, తిరిగి వాటిని తగిన భద్రతతో జిల్లా కేంద్రం రాయచోటి నందలి పర్మనెంట్‌ స్ట్రాంగ్‌ రూమునకు తరలించాలని కలెక్టర్‌ సూచించారు. డిస్ట్రిబ్యూషన్‌, సెప్షన్‌ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు వారు సూచనలు చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఆర్‌డి మోహన్‌ కుమార్‌, డిఎస్‌పి చైతన్య, రైల్వేకోడూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి లీలా రాణి, సంబంధిత తహశీల్దారులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️