అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

రావికమతంలో మోకాళ్లపై నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – యంత్రాంగం:సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా గరువారం కొనసాగింది. వివిధ రూపాల్లో అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెందుర్తి:ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. వారి పోరాటానికి జివిఎంసి 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మద్దతు తెలిపి మాట్లాడారు. సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి.జగన్‌, అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.బృందావతి, దేవి భవాని పాల్గొన్నారు. ఆనందపురం: అంగన్వాడీల సమ్మెలో భాగంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, ఐద్వా డివిజన్‌ కార్యదర్శి కె.నాగరాణి, అంగన్వాడీ జిల్లా కోశాధికారి పద్మావతి, ఆనందపురం, పద్మనాభం భీమిలి, మధురవాడ మండలాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు, పెందుర్తి : తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె ఒకవైపు చేస్తుండగా, మరోవైపు గురువారం రాత్రి పలు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి, కేంద్రాల్లోకి సచివాలయ సిబ్బంది చొరబడి హడావిడి చేయడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. నరవ, అప్పలనరసయ్య కాలనీ గంగిరెడ్డి కాలనీ, పల్లి నారాయణపురం, పెందుర్తి తదితర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు ఉసచివాలయ ఎంఎస్‌కె సిబ్బందితో పాటు మరికొంత మంది సిబ్బంది వెళ్లి, తాళాలు పగలగొట్టి రాత్రికి రాత్రి స్టాకును తనిఖీలు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు కొన్నిచోట్ల సిబ్బందిపై తిరగబడాడరు. అంగన్వాడీ టీచర్లు లేకుండా కేంద్రాల్లో చొరబడే అధికారం మీకెవరిచ్చారంటూ తిరగబడ్డారు. ప్రభుత్వం తీరు చాలా దుర్మార్గంఅమ్మవారు టీచర్లు సమ్మెలో ఉన్నారని తెలుసుకొని ఉన్నతాధికారుల ఆదేశాలతో కేంద్రాల్లోకి చొరబడడం దుర్మార్గమని అంగన్వాడీల యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బృందావతి ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీలు రాత్రికిరాత్రి ఎవరైనా స్టాక్‌ దొంగలించే అవకాశం ఉందాయని ప్రశ్నించారు. అలాంటపుడు ఇలా కేంద్రాల్లోని దౌర్జన్యంగా చొరబడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రభుత్వ తీరు దుర్మార్గమని, ఎన్ని కుట్రలు, పన్నాగాలు చేసినా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. నక్కపల్లి:సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి మూడవ రోజుకు చేరింది. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్లు, ఆయాలు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జనసేన నేత బోడపాటి శివ దత్‌, కాంగ్రెస్‌ పార్టీ నేత మేడేటి శంకర్‌ అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. ఏపీ అంగన్వాడి యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎం.దుర్గారాణి, యూనియన్‌ నాయకులు బి.సుబ్బలక్ష్మి, రమణమ్మ, సీత, నూకరత్నం, సత్య వేణి, కవిత, లక్ష్మి రాజ్యం, ఉమ్మడి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు .రావికమతం: ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన సమ్మెలో భారీ ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సమ్మెకు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మైచర్ల నాయుడు, పి.నాయుడు, ఎస్‌ శివశంకరు, బి .రామ నాయుడు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు బీ.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి సత్యవేణి, సిఐటియు మండల కార్యదర్శి వజ్రపు సత్యవతి పాల్గొన్నారు.మాడుగుల: మాడుగుల బస్టాండ్‌ ఆవరణలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని లేకుంటే సమ్మె ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు బేతా భాగ్యలక్ష్మి, మేడపు రెడ్డి జానకి తెలిపారు. అంగన్వాడి వర్కర్స్‌కు మాడుగుల మండల కాంగ్రెస్‌ నాయకులు పడాల కొండలరావు, తెలుగుదేశం నాయకులు పివిజి కుమార్‌ తమ సంఘీభావాన్ని తెలిపారు.గొలుగొండ:మండలంలోని జోగుంపేట గ్రామంలో అంగన్వాడీలు కేంద్రం తలుపులు తెరవడానికి ప్రయత్నించిన సిడిపిఒ గౌరిని గురువారం అడ్డుకున్నారు. దీంతో, సిడిపిఒ అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. గొలుగొండ:అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రాజాన వీర సూర్యచంద్ర డిమాండ్‌ చేశారు. గొలుగొండ ఐసిడిఎస్‌ కేంద్రం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, గత మూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్‌ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్‌, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, నాయకులు కొప్పాక కళ్యాణ్‌, జనరల్‌ సెక్రటరీ మారిశెట్టి రాజా, జనసైనికులు పాల్గొన్నారు. కశింకోట :సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల పిలుపు మేరకు చేపట్టిన సమ్మె మూడో రోజూ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసు వద్ద దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా మూడో రోజు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు దాకారపు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శేష, కశింకోట మండల నాయకులు తనూజ, కృష్ణవేణి, వరలక్ష్మి పెద్ద సంఖ్యలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని జనసేన నియోజకవర్గం ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు సందర్శించి మద్దతు తెలిపారు.కె.కోటపాడు : తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారం నాటికి మూడవ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి కేంద్రాలను తెరిపించడానికి పూనుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి కుమారి హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, అంగన్వాడి కార్యకర్తలు పి భవాని, ఎం లక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మునగపాక రూరల్‌ : మునగపాకలో గురువారం అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ధర్నా శిబిరం వద్ద మోకాళ్లపై నించొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఈ ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌ బ్రహ్మాజీ, కె.సోమనాయుడు, ఆడారి రామలక్ష్మి, అంజలి, తులస లక్ష్మి, బంగారమ్మ, అరుణకుమారి, జయలక్ష్మి, వెంకటలక్ష్మి, సరస్వతి, హేమలత పాల్గొన్నారు.తాళాలు తెరిచేందుకు ప్రయత్నంమండల కేంద్రంలోని సచివాలయానికి సచివాలయ కానిస్టేబుల్‌ వెళ్లి రాయితో తాళం కప్పలను విడగొట్టే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న సిఐటియు నాయకులు ఎస్‌ బ్రహ్మాజీ, కే సోమనాయుడు అడ్డుకొని ఆమెతో వాగ్వివాదం చేశారు. అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలు తీర్చమని శాంతియుతంగా ధర్నా వేసుకున్నారే తప్ప, హింసకు పాల్పడలేదని పేర్కొన్నారు. రాయితో కప్పలను విడగొట్టి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం ఏ చట్టంలో ఉందని ఎదురు ప్రశ్న వేశారు. దానితో ఆమె రాయిని అక్కడే పడవేసి వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆడారి రామలక్ష్మి అంజలి, తులస లక్ష్మి, బంగారమ్మ, అరుణకుమారి, జయలక్ష్మి, వెంకటలక్ష్మి, సరస్వతి, హేమలత, సిఐటియు నాయకులు ఎస్‌ బ్రహ్మాజీ, కే సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.నాగవరంలో..మునగపాక రూరల్‌ : మండలంలోని నాగవరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టేందుకు సచివాలయ సెక్రటరీతో కూడిన బృందం గురువారం విఫల ప్రయత్నం చేశారు. అంగన్వాడీలు సమ్మె బాట పట్టడంతో అంగన్వాడి కేంద్ర కప్పలను విడగొట్టి గదిని తెరిచే ప్రయత్నం చేయగా స్థానిక ఎంపీటీసీ పాలిపిని శ్రీనివాసరావు అడ్డుకున్నారు. మీ దగ్గర ప్రభుత్వ జీవో ఏమైన వుందా అని ఆయన ప్రశ్నించగా పంచాయతీ సెక్రటరీ అక్కడనుండి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అంగన్వాడీల పై కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహారించుకోవడం మానుకోవాలని పంచాయతీ సెక్రటరీని , సిబ్బందిని హెచ్చరించారు.

➡️