కించుమండలో అక్రమ కట్టడాలు

అక్రమంగా చేపట్టిన షాపు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని కించుమండలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలు జోరుగా జరుగుతున్నాయి. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు రోడ్డు పక్కనే ఉన్న ఆర్‌ అండ్‌ బి స్థలాల్లో శాశ్వత షాపుల అక్రమ కట్టడాలను నిర్మించుకుంటున్నారు. గతంలో ఈ స్థలాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగించేవారు. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ తరువాత 1/70 చట్టానికి విరుద్ధంగా శాశ్వత షాపులను నిర్మించు కుంటున్నారు. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రాకపోకలు సాగించే జాతీయ రహదారికి అనుకుని అక్రమ కట్టడాలు జరుగుతున్నా పంచాయతీ అధికారులు కళ్లకు కనబడకపోవడం విశేషం. అధికారులు అక్రమ కట్టడాల నిలుపుదలకు చర్యలు తీసుకోకపోవడంతో గిరిజనేతరుల అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదని స్థానికులు, పలు ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.జీవనోపాధి కోసం రోడ్డు పక్కన ప్రభుత్వ భూముల్లో తాత్కాలిక దుకాణాలు నిర్మించుకుంటే వెంటనే స్పందించి తొలగించే అధికారులు, గిరిజనేతరులు దర్జాగా శాశ్వత దుకాణాలు నిర్మించుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఆర్‌ఐ హరిని వివరణ కోరగా కించుమండలో గిరిజనేతరుల దుకాణాలు పరిశీలించి నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

➡️