గర్భిణులు,బాలింతలు,చిన్నారుల నిరసనలు

అరకులో అంగన్‌వాడీలతో కలిసి నినాదాలు చేస్తున్న గర్భిణులు, బాలింతలు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరవ రోజుకు చేరింది. అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న బాలింతలు, గర్భిణీలు, పిల్లలు సమ్మె వద్ద వచ్చి అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెను మద్దతు తెలిపారు.అనంతరం రోడ్డు ప్రమాదాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ చిత్రపటానికి అంగన్వాడిలు, నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఉద్యోగుల కోసం అనేక పోరాటాలు చేశారని, అలాంటి నాయకులు మన మధ్య లేకపోవడం ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. ఆరు రోజులుగా అంగన్వాడిలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు పెంచుతామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలో వచ్చాక మాట మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.నాగమ్మ, ప్రాజెక్టు కమిటీ నాయకులు పాంగి వెంకటలక్ష్మి, లక్ష్మి, నిర్మల, జానకి, భవాని, సీత, గౌరమ్మ, వంజన పాల్గొన్నారు. అనంతగిరి:సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చేపట్టిన అంగన్వాడిల సమ్మె కొనగింది. అంగన్వాడీ కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం తీసుకున్నప్పటికీ అంగన్వాడిలు ఒడిదుడుకులకు లోనవ్వ లేదు. గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లులతో కలిసి సమ్మె కొనసాగించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల యూనియన్‌ నాయకురాలు సిహెచ్‌ కళావతి. పి,మంజుల, కుమారి, చిలకమ్మ, కార్యకర్తలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు పెదబయలు:అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోండా సన్నిబాబు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా అంగన్వాడి సెంటర్లను సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులతో తెరిచేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో జరిగే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మానపడాల్‌, సిఐటియు పూర్వ మండల కార్యదర్శి, బొండా గంగాధరం, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు టి రాజమ్మ, ఎస్‌.సుశీల, మంగమ్మ, శాంతి, కొండమ్మ, కుర్ర దేవి, పార్వతి, వరహాలమ్మ పాల్గొన్నారు.చింతూరు: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆరో రోజూ కొనసాగింది. అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, మహిళలు ఆదివారం మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద నిరసనలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారంతా డిమాండ్‌ చేశారు.కూనవరం : మండలంలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో పిల్లలు, తల్లులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లులు పాల్గొన్నారు.రాజవొమ్మంగి : అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా తిప్పి కొట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, లోదొడ్డి సర్పంచ్‌ లోతా రామారావు పిలుపునిచ్చారు, మండలంలోని లోదొడ్డి పంచాయతీ పరిధిలోని లోదొడ్డి, పూదేడు, కేశవరం, పాకవెల్లి గ్రామాల్లో అంగన్వాడీలకు మద్దతుగా చిన్నారులు, మహిళలు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని, కేంద్రాలకు నాణ్యమైన సరుకులు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు జర్త రాజుబాబు, వి సత్యనారాయణ, మురళి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం : అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆదివారం తమ తమ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల వద్ద లబ్ధి పొందుతున్న చిన్నపిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతలకు తాము చేపట్టిన సమ్మె ఉద్దేశాన్ని వివరించారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. దీంతో వారంతా ఆయా కేంద్రాల వద్ద నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి కె.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విఆర్‌.పురం : మండల కేంద్రంలో రేఖపల్లి జంక్షన్‌లో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన 6వ రోజుకు చేసింది. ఈ ధర్నా శిబిరాన్ని సందర్శించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకుండా, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వెలుగు, సిడిపివోల చేత గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల తాళలు బద్దలుకొట్టడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో జరిగే ఎన్నికల్లో ఘోర పరజయానికి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షురాలు నాగమణి, కార్యదర్శి రాజేశ్వరి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనం సత్యనారాయణ, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️