జగనన్నా..హామీల అమలు ఏదన్నా.

అరకులోలోయలో పిల్లలతో సమ్మె చేపడుతున్న అంగన్‌వాడీలు (ఫైల్‌ పొటొ)

..ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అంగన్వాడీల బతుకులు దుర్భరంగా మారాయి. చాలీచాలని వేతనంతో అగచాట్లు పడుతున్నారు. కేంద్రాలకు వచ్చే చంటి బిడ్డల ఆలనా పాలనా, గర్భిణుల, బాలింతల సంరక్షణ లక్ష్యంగా రోజంతా శ్రమిస్తున్నా ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనంతోనే తమ కుటుంబాలను కష్టంగా నెట్టుకొస్తున్నారు.ఉద్యోగ భద్రత కల్పన, అప్పులు చేసి ఖర్చుపెట్టిన బిల్లులు ఇవ్వాలని వంటి సాధారణ సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె బాట పట్టారు. జగనన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.వెయ్యి అదనంగా వేతనం చెల్లిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చిన సిఎం జగన్‌ నిండా మోసం చేశారని, తమ న్యాయమైన తమ డిమాండ్ల సాధనకు అల్లూరి జిల్లాలోని సమ్మె బాట పట్టామని అంగన్వాడీలు చెపుతున్నారు.అల్లూరి జిల్లాలోని 19 ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3214 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 4800 మంది పని చేస్తున్నారు. తమ సమస్యలపై అనేక రూపాల్లో ఆందోళనలు చేసినా వైసిపి ప్రభుత్వం పట్టించుకో లేదు. తొలిసారిగా వైసిపి పాలనలో అంగన్వాడీల సమ్మె సాగుతోంది. వేతనం పెంపుదల, గ్రాట్యూటీ, కేంద్రాల బకాయి అద్దె, ఆయాలకు పదోన్నతి, ముఖ హాజరు యాప్‌ రద్దు, భీమా, వేతనంలో సగం పెన్షన్‌ విధానం అమలు..తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా అంగన్‌వాడీలు ఉద్యమ బాట పట్టారు. అధికారంలోకి రాగానే వీటన్నింటిని అమలు చేస్తామంటూ జగన్‌ హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా అమలు చేయకపోవడంతో వైసిపి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సమ్మెకు దిగారు.డిమాండ్లు ఇవి..-అంగన్‌ వాడీ కార్యకర్త కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. – కేంద్రాల్లో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలి. మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చడంతో పాటు సిబ్బందికి పదోన్నతులు కల్పించాలి. సహాయకులకు పదోన్నతి నిబంధనలు రూపొందించాలి. పదోన్నతి వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. బీమా సౌకర్యం కల్పించాలి. సర్వీసులో ఉండి ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మేను చార్జీలు పెంచాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందించాలి. ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలి. కేంద్రాలకు నేరుగా వంట గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టిఎ బకాయిలు, ఇతర బిల్లులు వెంటనే చెల్లించాలి. సమావేశాలకు హాజర య్యేందుకు ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ని రద్దు చేయాలి. అన్ని యాప్స్‌ ఒకే యాప్‌గా మార్చాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలి. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి.

➡️