టెన్త్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

పాడేరులోని శ్రీకష్ణాపురం పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని పాడేరు రంపచోడవరం డివిజన్ల లో 65 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 11,286 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావలసి ఉండగా..10,985 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 295 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా నిఘా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారు. తొలి రోజు పరీక్షలో డీబార్స్‌ వంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. 11 సిట్టింగ్‌ స్క్వాడ్‌, 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరీక్షలను పర్యవేక్షించాయి. టెన్త్‌ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు విలేకరులకు తెలిపారు.టెన్త్‌ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ రాజవొమ్మంగి: మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో విద్యార్ధులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఎటువంటి అసౌకర్యం కలగనీయరాదని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, ఫర్నిచర్‌, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం కల్పించవద్దన్నారు. కలెక్టర్‌ స్థానిక తహశీల్దార్‌ సత్యనారాయణ, సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ వెంకయ్య సిబ్బంది ఉన్నారు.

➡️