తొలిరోజు సజావుగా ఇంటర్‌ పరీక్షలు

పాడేరులో పరీక్షలకు హాజరైన విద్యార్థులు

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలి రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి.. పాడేరు, రంపచోడవరం డివిజన్లోని 22 మండల కేంద్రాలతో పాటు మరికొన్ని చోట్ల అదనంగా ఏర్పాటు చేసిన మొత్తం 27 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఇంటర్‌ పరీక్షలు సజావుగా మొదలయ్యాయి. జిల్లాలో మొత్తం 7759 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయవలసి ఉండగా, హాజరైన వారు 7191 కాగా 568 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ నరికట్టేందుకు సీసీ కెమెరాలు నిఘాతో పాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా పరిధిలో మొదటి రోజు ఇంటర్‌ పరీక్షల్లో ఎటువంటి డిబార్‌ వంటి ఘటనలు జరగలేదని ఇంటర్‌ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారి ఎం.వినోద్‌ బాబు స్పష్టం చేశారు.డుంబ్రిగుడ:మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రం చుట్టూ పోలీసుల పహారా మధ్య కట్టుదిట్టంగా జరిగింది. ఈ పరీక్ష కేంద్రాన్ని స్థానిక సీఐ రుద్ర శేఖర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, పరీక్ష కేంద్రం ఆవరణలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకూడదని హెచ్చరించారు. పరీక్ష కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట స్థానిక ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ ఉన్నారు.ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఐటీడీఏ పిఓ రంపచోడవరం : రంపచోడవరం గురుకుల కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ హైస్కూల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలను ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో పాసైతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రాజవొమ్మంగి : స్థానిక గురుకుల కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రధమ ఇంటర్‌ తెలుగు1 పరీక్షకు 13 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. 305 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 292 మంది హాజరైనట్లు డిపార్ట్మెంట్‌ అధికారి ఈశ్వర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఒకేషనల్‌ పరీక్షకు 20 మందికి 20 మంది హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను రాజవొమ్మంగి సీఐ సన్యాసినాయుడు, సిబ్బంది పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిటి ఏ.సత్యనారాయణ, ఎస్‌ఐ వెంకయ్య పాల్గొన్నారు.సీలేరు : జీకే వీధి మండలం సీలేరులో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని జీకే వీధి సీఐ అశోక్‌ కుమార్‌ పరిశీలించారు. 144 అమల్లో ఉన్నందున పరీక్ష కేంద్రాన్ని చుట్టుపక్కల ఎవర్ని అనుమతించరాదని సిబ్బందికి ఆదేశించారు.మారేడుమిల్లి : స్థానిక ఏపి రెసిడెన్సియల్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏపిఆర్‌ కళాశాల నుండి 171, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి 100, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల నుండి 39 మంది మొత్తం 310మంది విద్యార్థులు హాజరైనట్టు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.

➡️