సాగు భూముల జోలికొస్తే తరిమి కొట్టండి

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి అనంతగిరి:గిరిజనుల సాగు భూమి కబ్జాకు పాల్పడి అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్న గిరిజన నేతరులను తరిమి కొట్టాలని స్ధానిక సీపీఎం జెడ్పీటీసీ దీసరి గంగరాజు పిలుపునిచ్చారు. మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ బీంపోలు పంచాయతీ సరియపల్లి రెవెన్యూ పరిధిలోని సిపిఎం బృందం శనివారం పర్యటించింది. ముందుగా భూ స్వాములు కబ్జాకు పాల్పడిన భూములను పరిశీలించారు. అనంతరం గిరిజనులతో గంగరాజు మాట్లాడుతూ, సరియపల్లి రెవెన్యూ పరిధి వివిధ గ్రామాల రైతులు గత 80 సంవత్సరాల నుండి భూమిని సాగు చేస్తున్నారని, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయని తెలిపారు. వెబ్‌ ల్యాండ్‌లో కూడా సాగు రైతుల పేర్లు ఉన్నా స్థానిక నాయకులతో కలిసి కొంత మంది భూస్వాములు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. భుస్వాములు గ్రామాలలో అడుగు పెట్టకుండా తరమి కొటాలనీ రైతులకు పిలుపు నిచ్చారు. ఇదే భూములపై 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో సీపీఎం రైతులకు అండగా నిలిచి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి నిషేధిత భూములుగా చేర్చి 22ఎగా నమోదు చేసి క్రయ విక్రయాలు చేయరాదని సిట్‌ స్పష్టం చేసిందన్నారు. గతంలో కొనుగోలు చేసిన చిరంజీవి రాజు ఈ భూములకు తనకు సంబందం లేదని, రైతులు సాగులో ఉన్నారని, పొరపాటున తన పేరు వచ్చిందని రైతులకు తిరిగి వెబ్‌ లెండ్‌ లో నమోదు చేయాలని సిట్‌ అధికారులకు లిఖిత పూర్వకంగా ఇచ్చారని తెలిపారు. ఇదే భూమికి కొంత మంది భూస్వాములు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తిరిగి ఆండ్ర జమీందారు భార్య పేరున వెబ్‌ లెండ్‌లో అన్లైన్‌ చేసి క్రయ విక్రయాలు చేశారని తెలిపారు. ఈ భూములను ఏ విధంగా రెవెన్యూ అధికారులు మార్పులు, చేర్పులు చేశారని ఆయన ప్రశ్నించారు. రైతుల అనుమతి లేకుండా అక్రమంగా వారి సాగు భూములలో రోడ్డు వేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ జన్ని బిమలమ్మ, టోకూరు సర్పంచ్‌ కిల్లో మోస్య, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జేష్ట వెంకటరమణ, మాజీ సర్పంచ్‌ సారా సద్దుపల్లి సింహాచలం, మాజీ ఎంపిటిసి సభ్యులు పల్లి సరస్వతి, రైతులు తామరపల్లి సన్యాసి, సోమెల సన్యాసి పాల్గొన్నారు

➡️