సిపిఎం నేతల నిరసన

నినాదాలు చేస్తునఏ నాయకులు

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌: మండలంలోని మాదల పంచాయతీ మారుమూల దాబుగుడ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మహిళలు, సిపిఎం నాయకులు కుళాయి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కుమిడి రమేష్‌ మాట్లాడుతూ, గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, కనీసం తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. తాగునీరు లేక బురద నీటిని తాగవలసిన పరిస్థితి నెలకొందని, దీంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు మారినా గ్రామంలో తాగునీటి సమస్యలపై ఎవ్వరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం బలపరిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామంలో తాగునీరు, వివిధ సమస్యలపై పోరాడి సాధిస్తామన్నారు. బిజెపి, వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు గిరిజన హక్కులు చట్టాలు నిర్వీర్యం చేశాయని, ఇలాంటి పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ప్రజా సమస్యలు, గిరిజన హక్కులు, చట్టాలను కాపాడే సిపిఎం అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాదల గ్రామ పంచాయతీ సీపీఎం కార్యదర్శి కొర్ర అప్పన్న, సిరగం ప్రసాద్‌, సిరగం సొన్ను, సిరగం కోములు, పాంగి రాము, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️