అరుకు సీటును బిజెపికి కేటాయిస్తే సహకరించేది లేదు

Apr 7,2024 00:09
మాట్లాడుతున్న దొన్నుదొర

ప్రజాశక్తి -అరకులోయ :రాష్ట్రంలో బీజేపి, టీడీపి, జనసేన పొత్తులో భాగంగా అరకు అసెంబ్లీ టికెట్‌ టిడిపి సమన్వయకర్త సియారి దొన్ను దొరకు కేటాయిస్తేనే పని చేస్తామని, బిజెపికి ఇస్తే సహకరించేది లేదని టిడిపి నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. అరకు టికెట్‌ దున్ను దొరకు మార్పు చేసి బిజెపి పార్టీకి చెందిన పాంగి రాజారావుకు టికెట్‌ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు రగిలి పోయారు. శనివారం అరకులోయ మండలం పద్మపురంలోని ఉషోదయ రిసార్ట్స్‌లో నియోజకవర్గ మండల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జి సీయారి దొన్నుదొర హాజరయ్యారు. మండల వారీగా అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి దొన్నుదొర మాట్లాడుతూ, టిడిపి మొదటి జాబితాలో అరకులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో వేలాదిమంది ప్రజల ఎదుట నన్ను తనకు టికెట్‌ కేటాయించి ఇప్పుడు బిజెపికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా అధిష్టానం బిజెపికి టికెట్‌ ఎలా కేటాయిస్తుందని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం నిరంతరం కష్ట పడి పనిచేసి తన సొంత ఆస్తులను అమ్ముకొని పార్టీని నడిపినా అధిష్టానం తనను ఎందుకు గుర్తించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకు నియోజకవర్గంలో టిడిపికి బలంగా ఉందని, ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేని బిజెపికి ఎలా టికెట్‌ ప్రకటిస్తారని ఆయన అన్నారు. టికెట్‌ ఇచ్చే ముందు తమను ఎందుకు సంప్రదించలేదని నారా లోకేష్‌ని అడిగినప్పుడు బిజెపి అధిష్టానం ఒత్తిడితోనే బిజెపికి టికెట్‌ కేటాయించడం జరిగిందని, అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని, తనకు నమ్మకం లేదన్నారు. రా కదలిరా సభలో వేలాది మంది సమక్షంలో ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు తప్పారని ఇప్పుడు ఎలా నమ్ముతామని ఆయన అన్నారు.బిజెపికి టికెట్‌ కేటాయించిన విషయం తెలుసుకుని ఇంట్లో కుటుంబమంతా మనస్థాపానికి గురై చనిపోవడానికి కూడా సిద్ధమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలో ఇంత కష్టపడి ముందుకు నడిపించిన నాయకుడికి పార్టీ గుర్తించలేదంటే భవిష్యత్తులో కార్యకర్తలకు ఏమి గుర్తింపు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అరకు అసెంబ్లీ సీటు తనను కేటాయించాలని చంద్రబాబు నాయుడు కు చెప్పడంతో బిజెపి అధిష్టానం ఒత్తిడితోనే ఇలా జరిగిందని అర్థం చేసుకోవాలని బుజ్జగింపు ప్రయత్నం చేశారన్నారు. అధిష్టానానికి కలిసి వారం రోజులైనా కనీసం స్పందించడం లేదని, నాయకులు, కార్యకర్తలు ఏమి చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ, ఓటు బ్యాంకు లేని బీజేపీ పార్టీకి ఎలా సపోర్ట్‌ చేస్తామని ప్రశ్నించారు. దొన్ను దొరకు టికెట్‌ వచ్చేంత వరకు పోరాడతామని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేయిస్తామని వారు అన్నారు. ఇటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీల నాయకులకు రాకూడదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నీడలో పనిచేయడానికి ఏ కార్యకర్త నాయకులు సిద్ధంగా లేరని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించాలని టిడిపి శ్రేణులు కోరారు. పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టిలి దాసుబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నేతలు పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️