పాఠశాల భవనం పూర్తి చేయరూ…

రేకుల షెడ్డులో చదువుకుంటున్న విద్యార్థులు

ప్రజాశక్తి-అనంతగిరి:పాఠశాల భవనం లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అర్ధాంతరంగా నిలిచిన భవనం పనులు పూర్తి చేయాలని విద్యార్థులు వినూత్న రీతిలో సోమవారం మోకాళ్లపై చేతులు జోడించి నిరసన చేపట్టారు. మండలంలోని వేంగడ పంచాయతీ డొంకపుట్టు ఎంపీపీ ప్రాథమిక పాఠశాలకు భవనం లేదు. దీంతో, చిన్నపాటి రేకు షెడ్డులో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో గది లోపల వర్షపు నీరు ప్రవేశిస్తుండటంతో కుర్చోలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డాలింగ్‌ పుట్టు, పెన్నంతి, మరివలస, మెట్టపాడు, డొంకపుట్టు గ్రామాలకు చెందిన 67 మంది విద్యార్థులు డొంకపుటు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాల పనులు గోడ వరకు చేపట్టి నిలిపి వేశారు.పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని ప్రజాశక్తి దినపత్రికలో కథనాలు రావడంతో స్పందించిన ఐటీడీఏ పిఒ పాఠశాల నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల నిధులు 2023 సంవత్సరంలో మంజూరు చేశారు. కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించగా బిల్లులు అందకపోవడంతో భవనం పనులను నిలిపివేశారు. పాఠశాల భవనం పనులు పూర్తి చేయాలని సీపీఎం మాజీ సర్పంచ్‌ సివెరి కొండలరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు పనులు పూర్తి చేయాలని, లేకుంటే పాడేరు కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులతో ఆందోళ చేస్తామన్నారు.

➡️