తాగునీటి కష్టాలు

Apr 21,2024 00:00
కావిడతో నీటిని మోసుకొస్తున్న గిరిజనుడు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని అతిమారుమూల ప్రాంతమైన కుమడ పంచాయతీ చీపురుగొందిలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చీపురుగొంది గ్రామంలో 48 కుటుంబాలు ఉండగా సుమారు 200 మంది జనాభా ఉంది. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక సుమారు 1 కిలోమీటరు దూరంలో కొండకి ఆనుకొని ఉన్న చెలమ వద్దకు అతి కష్టం వెళ్లి నీటిని కావిళ్లతో మోసుకొని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.కొండ చెలమ నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు గొల్లూరి తిల్లి, కిల్లో మల్లేష్‌, గుంట సన్యాసిరావు, కె.జిన్ను, జి.వెంకటరావు, గుంట సుబ్బారావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టిడిపి, వైసిపి పార్టీల నేతలు ఎన్నికల వేళలో ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప గిరిజన ప్రజల సమస్యలను పరిష్కారం చేయ లేదన్నారు. ఏళ్ల తరబడి పాలకులు పరిపాలన చేసినప్పటికీ తాగునీరు సౌకర్యం కల్పించలేదన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం సైతం తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పనలో విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఎండాకాలంలో మంచినీరు దొరకడం గగనమైందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️