పూరిగుడిసెల్లోనే జీవనం..

తేనెపుట్టులో ఉన్న పూరి గుడిసె

.ప్రజాశక్తి -అనంతగిరి:పివిటిజిలకు పక్కా గృహాలు నిర్మించేందుకు నిధు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటలనకే పరిమితమైంది. నిధులు మంజూరు చేయడంలో విఫలమైంది. దీంతో ఆదిమ జాతి తెగకు చెందిన కోదు, గదభ, ఇతర జాతులకు చెందిన గిరిజనులు సరైన ఇల్లు లేక పెంకెటిల్లు, పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు.అనంతగిరి మండలం అనంతగిరి, టోకూరు, కోనాపురం, పెద్దకోట, పినకోట, జీనవాడు, పైనంపాడులోని పివిటిజిలకు సరైన నివాస గృహాలు లేక తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నారు. పివిటిజలకు పెద్దపీట వేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు కాలేదు. కొంతమంది పివిటిజిల ఖాతాలలో పునాది దశకు రూ.70 వేల నిధులు జమ అయినప్పటికీ చాలా మంది ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ప్రతి కుటుంబానికి గృహాలు నిర్మించేందుకు ఆరు లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో వారంతా ఉన్న ఇల్లు తొలగించి ప్రస్తుతం ఉండేందుకు సరైన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనంతగిరి పంచాయతీ తేనెపుట్టు, తెల్లారపాడు, డెక్కపూరంతో పాటు టోకురు, కాశీపట్నం, బీంపోలు తదితర పంచాయతీ గిరిజనులకు నేటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పివిటిజిలు కోరుతున్నారు. లేని పక్షాన మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పివిటిజిలు హెచ్చరించారు.

➡️