రోడ్డు పనులు ప్రారంభించాలి

అనంతరం గ్రామస్తులు జడ్పిటిసితో మాట్లాడుతూ

ప్రజాశక్తి -అనంతగిరి:ఫారెస్ట్‌ అధికారుల ఆటంకంతో నిలిచిన రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించాలని స్థానిక సిపిఎం జడ్పిటిసి దీసరి. గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సమస్యలు తెలుసుకునేందుకు మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కడరేవు గ్రామంలో సందర్శించారు. అనంతరం గ్రామస్తులు జడ్పిటిసితో మాట్లాడుతూ, రోడ్డు పనులు చేపట్టేందుకు గత రెండు సంవత్సరాల కాలంలో పనులను ప్రారంభించారని తెలిపారు. నిలిచిన పనులు తక్షణమే పున్ణప్రారుబించాలని ఆందోళన చేపట్టగా సంబంధిత ఉన్నత అధికారులు దిగొచ్చి జెసిబిలతో రోడ్డు పనులు చేపడుతుండగా ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. అనంతరం గిరిజనులను ఉద్దేశించి గంగరాజు మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు కనెక్టివిటీ పాడేరు ప్రాజెక్ట్‌ కింద ట్రైబల్‌ వెల్ఫేర్‌ పథకం కింద కోటీ 70 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. 2021 -22 సంవత్సరంలో గుమ్మ పంచాయతీ పరిధి నిమ్మ ఊట నుండి సుమారు మూడు కిలోమీటర్లు దూరం పనులను చేపట్టిన పనులు వదిలి వేశారన్నారు. పనులు జరగకుండానే నిధులు సుమారు 65 లక్షల పైగా స్వాహా జరిగినట్లు ఆందోళన చేపట్టడంతో అధికారులు దిగొచ్చి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం సమిద, నెరడి బంద మీదుగా కడరేవు, గోకులపాలెం, కొట్టెంగుడ మీదుగా కరిగోడ వరకు రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రారంభించగా ఫారెస్ట్‌ అధికారుల ఆటంకంతో నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారుల పనితీరులో మార్పు రాలేదని మండిపడ్డారు. దీనిపై ఉమ్మడి జిల్లా పరిషత్‌ పాలకవర్గం సమావేశంలో లేవనెత్తి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వంతో పోరాటం చేసి నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు ఆటంకం పరచడం ఎంత సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రోడ్డు పనులకు అనుమతులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్‌ కిల్లో మొస్య, గ్రామస్తులు రాపా రాజారావు, నందుల రాజారావు, సింహాద్రి, గోపాలరావు, సన్యాసి పాల్గొన్నారు.

➡️