ఘనంగా శారదా నికేతన్‌ వార్షికోత్సవ వేడుకలు

Apr 14,2024 00:00
శారద చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న సిహెచ్‌ నర్సింగరావు, పల్లంరాజు, తదితరులు

ప్రజాశక్తి- అరకులోయ :ఏజెన్సీ ప్రాంతంలో విలువైన విద్యను అందించడమే శారదా నికేతన్‌ లక్ష్యమని శారధ నికేతన్‌ వ్యవస్థాపకులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. అరకులోయలోని శారదా నికేతన్‌ పాఠశాలలో శనివారం 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. మరింత మెరుగు పడే విధంగా విద్యను అందించాలని కోరారు. విద్యను మించిన ఆస్తి లేదని, దీని ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించి జ్ఞానం పెంపొందించడమే శారదా నికేతన్‌ ప్రధాన లక్ష్యమన్నారు.రిటైర్డ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ పల్లం రాజు మాట్లాడుతూ, అత్యంత వెనుకబడి ఏజెన్సీ ప్రాంతంలో శారదా నికేతన్‌ పాఠశాలను నెలకొల్పి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్కూల్‌ను నిర్వహించడం పై అభినందించారు. ఉపాధ్యాయులు గుణాత్మక విద్యను గిరి పుత్రులకు అందించడంతో దేశ భవిష్యత్తుకు పునాది వేసిన వారు అవుతారని తెలిపారు.గుణాత్మకమైన విద్య అందించడంతో సమాజానికి మేలు జరుగుతుందన్నారు.యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి మహేష్‌ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే సత్ప్రవర్తన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించే విధంగా, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు విద్యను అందించాలని ఆయన ఆకాంక్షించారు.ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.ప్రభావతి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలోని బాలబాలికలకు విద్యను అందించడమే శారద లక్ష్యమన్నారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. అందరి సహకారంతో శారదా ట్రస్ట్‌ నడుస్తుందని పేర్కొనానఉ.ప్రిన్సిపాల్‌ చిరంజీవి మాట్లాడుతూ, 2007లో ప్రారంభమైన ఈ పాఠశాల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నారు. మొదటగా 171 మంది పిల్లలతో ప్రారంభమైన శారధి నికేతన్‌ నేడు ఎల్‌ కే జీ టు టెన్త్‌ వరకు 930 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని ఆయన వివరించారు. చదువుతోపాటు అనేక సామాజిక కార్యక్రమాలు, మెడికల్‌ క్యాంపు పాలిటెక్నిక్‌ కోచింగ్‌ వంటివి కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ, విద్యార్థి స్థాయిని గుర్తించి చదువు చెప్పాలని ఆయన సూచించారు. ముందుగా డి. శారద చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డి.శారదా కుమార్తె సుమిత్ర జ్యోతి ప్రజ్వలన చేశారు.

➡️