పింఛను సొమ్ము కోసం పాట్లు

May 3,2024 00:15
చింతూరులో బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న పింఛనుదారులు

పజాశక్తి-చింతూరు :ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ల సొమ్మును ఈ నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో ఆ డబ్బులు తీసుకొనేందుకు గురువారం బ్యాంకులకు భారీగా తరలివచ్చిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున వాలంటీర్ల సేవలను నిలిపివేయడంతో పింఛన్లు ఇంటింటికి పంపిణీ ఏప్రిల్‌ నెలలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మే నెలలో పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బులు తీసుకొనేందుకు గురువారం చింతూరులోని భారతీయ స్టేట్‌ బ్యాంకుకు పింఛను లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చింతూరు చుట్టుపక్కల 100 గ్రామాలకు ఈ బ్యాంకే ఆధారం. మారుమూల గిరిజన గ్రామాల నుండి ఆటోలు, ఇతర రవాణా సౌకర్యాల ద్వారా పింఛనుదారులు మండల కేంద్రానికి వచ్చి ఉదయం నుండి బ్యాంకు ముందు బారులు తీరారు. ఒకేసారి అధిక సంఖ్యలో పింఛనుదారులు రావడంతో అందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చెల్లింపులు కొంతమేర జాప్యం జరిగింది. దీంతో లబ్ధిదారులు సాయంత్రం వరకు నిరీక్షించాల్సి రావడంతో ఆకలితో ఎండ వేడికి తాళ లేక వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పింఛన్ల కోసం బారులు తీరిన వృద్ధులురంపచోడవరం : స్థానిక యూనియన్‌ బ్యాంకులో గురువారం వృద్ధాప్య పింఛన్ల సొమ్ము కోసం రంపచోడవరం పరిసర ప్రాంతాల నుండి లబ్ధిదారులు భారీగా తరలి వచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఉదయం నుండ బ్యాంకు వద్ద వృద్ధులు బారులు తీరారు. వీరి కోసం బ్యాంకు, సచివాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పింఛన్‌ కోసం వెతలుప్రజాశక్తి-డుంబ్రిగుడ:- వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్లు ఈనెల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పింఛన్లు తీసుకోవడానికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా డుంబ్రిగూడలో యూనియన్‌ బ్యాంకు, కించుమండలో స్టేట్‌ బ్యాంకులు ఉంది. ఈ బ్యాంకులకు సుమారుగా 20 నుంచి 30 కిలోమీటర్లు దూరంలో మారుమూల గ్రామాలు ఉన్నాయి. అంతదూరం నుంచి బ్యాంకుల వద్దకు వ్యయ ప్రయాసాలతో ఉదయం చేరుకుని సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద వేచి ఉంటూ పింఛన్లు తీసుకుని తిరుగు ముఖం పడుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పింఛన్‌ లబ్ధిదారుల సౌకర్యార్థం నీడ సౌకర్య కల్పించడానికి యూనియన్‌ బ్యాంకులో సిబ్బంది టెంటు సౌకర్యం కల్పించినప్పటికీ లబ్ధిదారులకు సరిపడక పోవడంతో కొంతమంది సమీపంలోని చెట్టు నీడల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కించమండ బ్యాంకులో అధికంగా లబ్ధిదారులు తరలి రావడంతో క్యూ లైన్‌ రోడ్డు వరకు చేరడంతో ఎండల్లో నిలబడి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది లబ్ధిదారులకు రెండు, మూడు బ్యాంకుల్లో అకౌంట్లు ఉండటంతో పింఛన్‌ నగదు ఏ బ్యాంక్‌ ఖాతాలో పడిందో తెలుసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు బాధిత పింఛన్‌ దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా నడవలేని వయోవృద్ధులు మరింత ఇబ్బందులు పడ్డారు. హుకుంపేట: మండలలోని పింఛన్ల కోసం వృద్ధులు, మహిళలు మారుమూల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున పింఛన్లు తీసుకోవడంతో కోసం హుకుంపేట బ్యాంకు ఆఫ్‌ బరోడా బ్యాంకు వద్ద పడిగాపులు కాశారు. డబ్బులు తీసుకోవాలని ఆశతో ఉదయం నుండి బ్యాంకు వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు.బ్యాంకు మేనేజర్‌ టెంటు, తాగునీరు ఏర్పాటు చేశారు.

➡️