టిడిపి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

Apr 11,2024 00:28
మాట్లాడుతున్న గిడ్డి ఈశ్వరి

ప్రజాశక్తి-పాడేరు: ప్రజాసేవే తన కర్తవ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి రెబల్‌ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్‌ గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. ఐదు మండలాల కార్యకర్తలతో బుధవారం కుమ్మరిపుట్టు వద్ద తన స్వగృహంలో భవిష్యత్‌ కార్యాచరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యకర్తల అభిప్రాయాల మేరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పని చేశానని, వేరొక వ్యక్తికి టికెట్‌ కేటాయించారన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా పని చేసి రెబల్గా గెలిపించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి పాడేరు నియోజకవర్గం నుండి గిఫ్టుగా ఇద్దామని ఆమె కార్యకర్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు పి గోవిందరావు, అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్‌, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

➡️