కొండిబకోటలో దాహం కేకలు

May 17,2024 23:29
పని చేయని తాగునీటి పథకం

ప్రజాశక్తి -అనంతగిరి:తాగునీటి సమస్య తలెత్తడంతో దాహం కేకలతో గిరిజనులు విలవిలడుతున్నారు. గత్యంతరం లేక పంట కాలువకు మళ్లించే కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రాయించవలసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తాగునీటి, మౌలిక వసతులు కల్పనకు కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్లు హామీలు గుప్పిస్తుందే తప్ప ఆచరణలో అమలు కాలేదు. ఇదీ మండలంలోని పెద్దకోట పంచాయతీ కొండిబకోట గ్రామంలో దుస్థితి తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కొన్ని ఏళ్ల క్రిందట గ్రామంలో ఏర్పాటు చేసిన నుయ్యి వద్ద మోటార్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలు తాగునీటి సరఫరా సాగింది. అనంతరం మోటారు కనెక్షన్‌ మరమ్మతుకు గురై సుమారు రెండు సంవత్సరాల నుండి పథకం మూలకు చేరింది. అప్పటి నుండి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుండి నేటి వరకు తాగునీటి సమస్యతో గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాలు పైగా 120 జనాభా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులకు, పంచాయతీ ప్రజా ప్రతినిధులకు పలుమార్లు కలిసి లిఖితపూర్వకంగా విన్నవించినా పట్టించుకునే నాధుడే కరువుయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టి తాగునీటి సరఫరా చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామనికి సీసీ రోడ్డుచ డ్రైనేజీచ ప్రభుత్వ గృహాలు వంటి పథకాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యాలకు గురైనప్పుడు, గర్భిణులు, బాలింతలను సకాలంలో వైద్య సేవలకు ఆసుపత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️