పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

May 26,2024 23:54 #Old students meet
Old students meet

ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : స్థానిక సిబిఎం హైస్కూల్‌లో 2004 టెన్త్‌ బ్యాచ్‌ విద్యార్థులు దాదాపు 20 ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు. ఒకరినొకరు కష్ట సుఖాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పటి అనుభూతులను పంచుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి హెచ్‌ఎం, ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. సుదీర్ఘకాలం తర్వాత ఒకే చోట కలయిక తమలో చెప్పలేనంత అనుభూతి కలిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. పూర్వ విద్యార్ధుల్లో పోలీస్‌, బ్యాంక్‌, ఉపాధ్యాయులు, ఆర్మీ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కొందరైతే, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థిర పడిన వారు మరికొందరు ఉన్నారు. పూర్వ విద్యార్థుల్లో చాలా మంది బెంగళూర్‌, హైదరాబాద్‌ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చారు. పద్మనాభం : మండలంలోని రెడ్డిపల్లి జెడ్‌పిహెచ్‌ పాఠశాల 1989-90 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. విజయనగరంలోని హోటల్‌లో ఆదివారం వారంతా కలుసుకున్నారు. పాఠశాలను విడిచి 35 ఏళ్ల అనంతరం మిత్రులందరూ కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగాలతో పాటు వారి కుటుంబాలు, పిల్లల చదువులు, ఉద్యోగాల గురించి చర్చించుకున్నారు. గత జ్ఞాపకాలను, అప్పట్లో బోధించిన ఉపాధ్యాయులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి అప్పల వెంకటరామారావు, కశిరెడ్డి బాలాజీ, కాళ్ల గోపీనాధ్‌, రెడ్డిపల్లి గోవిందరావు, గండి వెంకటరావు, తాలాడ పద్దు, బుగత బుజ్జి, ఎస్‌కెఎస్‌.ప్రసాద్‌, నిమ్మకాయల ఆదియ్య, తిర్నెడ్డి అప్పలరాజు, జంకల అప్పలరాజు, వడ్డాది శ్రీను, అవనాపు దేవుడు, సుంకర ఇందిర, రెడ్డిపల్లి బాల సరస్వతి, సుంకర హిమవతి తదితరులు పాల్గొన్నారు.

➡️