పాఠశాల భవనం మంజూరుకు కృషి

శిధిల భవనం పరిశీలిస్తున్న అప్పారావు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని పెదబోదుగల్లం లో శిధిలంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదులను శనివారం యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు పరిశీలించారు. తుఫాన్‌ ప్రభావానికి కురిసిన వర్షానికి తరగతి గదుల శ్లాబ్‌ పెచ్చులూడి పడడంతో స్ధానిక మండల విద్యాశాఖాధికారి కె.నరేష్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారని, సమస్యను పరిష్క రించాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉపవిద్యాశాఖాధికారి పి.అప్పారావు పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. శిధిలమైన తరగతి గదులను ఉపయోగించ రాదన్నారు. ఆ తరగతి గదులను బ్లాక్‌ చేసి పిల్లలను దరి చేరకుండా చూడాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్‌.సత్యనారాయణ మాట్లాడుతూ, కేవలం ఏడు తరగతి గదులు ఉండగా వాటిలో ఐదు గదులు శిధిలావస్ధకు చేరుకున్నాయని, కేవలం రెండు తరగతి గదులలో మాత్రమే తరగతులను నిర్వహించడానికి అవకాశం ఉందని తెలిపారు. పాఠశాల వసతి సమస్యను గుర్తించిన అప్పారావు మాట్లాడుతూ, వీలయినంత త్వరగా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను నివేదించి నూతన తరగతి గదుల మంజూరునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి కె.నరేష్‌, డి.ఆర్‌.వో.దయానిధి, పాఠశాల కమిటీ చైర్మన్‌ మహబూబ్‌ నిషా ఉన్నారు.

➡️