మహనీయుడు లెనిన్‌

Jan 22,2024 00:18
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, తదితరులు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌.శర్మ అన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ దరి నండూరి ప్రసాదరావు భవనంలో లెనిన్‌ శత వర్థంతి సభ పార్టీ సీనియర్‌ నాయకులు జిఎస్‌.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సభ ప్రారంభానికి ముందు లెనిన్‌ చిత్రపటానికి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, సీనియర్‌ నాయకులు పెతకంశెట్టి వెంకటరెడ్డి, జిఎస్‌.రాజేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ మార్క్స్‌, ఎంగెల్స్‌ సిద్ధాంతాన్ని లెనిన్‌ ఆచరణలో పెట్టి రష్యాలో దోపిడీ వ్యవస్థను కూల్చి కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించి నాయకత్వం వహించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి విముక్తి కలిగించే విధంగా కృషి చేసిన వ్యక్తి లెనిన్‌ అని తెలిపారు. కార్మిక రాజ్యం స్థాపించడం ఒక్క కార్మికులతోనే సాధ్యం కాదని, దానికి కార్మిక, కర్షక మైత్రి చాలా అవసరమని భావించి దానిని ఆచరణలో పెట్టిన గొప్ప నాయకుడు ఆయనని తెలిపారు. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని అమలు జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించారన్నారు. 1917లో రష్యాలో విప్లవం సాధించి సుదీర్ఘకాలం ప్రజాపరిపాలన సాగించారన్నారు. రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం వచ్చాక భారతదేశంలో భారీ పరిశ్రమలు పెట్టేందుకు యంత్రాలను ఇచ్చి తోడ్పాటు అందించిందన్నారు. నేడు భారతదేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని అమ్మేయడం లేదా మూసివేసే పనిలో ఉందన్నారు. పెట్టుబడిదారులకు లాభాల కోసం పనిచేస్తున్న దోపిడీ ప్రభుత్వాలను కూల్చి కార్మిక రాజ్యం స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ లెనిన్‌ సామ్రాజ్యవాద గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గొప్ప మహానీయుడన్నారు. భారతదేశానికి రష్యా చేసిన సహాయాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది పొడువునా లెనిన్‌ శత వర్ధంతి సభలు జరిపి పెట్టుబడిదారీ వ్యవస్థకు, సోషలిస్టు వ్యవస్థగల తేడాలను ప్రజలకు వివరించాలన్నారు.ప్రజాశక్తి, విశాలాంధ్ర ఆధ్వర్యాన.. విశాలాంధ్ర, ప్రజాశక్తి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో లెనిన్‌ శత వర్థంతి కార్యక్రమం జరిగింది. ముందుగా శత వర్థంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కవితలను వినిపించారు. మొదటి కవితగా ‘కర్తవ్యం’ చదివారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌.శర్మ హాజరై మాట్లాడారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కార్మిక, కర్షక వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తోందని, దీనిని ఎదుర్కోవాల్సి ఉందని అన్నారు. సిపిఐ జిల్లా నాయకులు సిఎన్‌.క్షేత్రపాల్‌ మాట్లాడుతూ మార్క్సిజం దివిటీని చేతబట్టి ప్రపంచానికి దారి చూపిన మహానేత లెనిన్‌ అని కొనియాడారు. సమావేశంలో విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఛైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, అరసం జిల్లా కార్యదర్శి ఉప్పల అప్పలరాజు పాల్గొన్నారు.సిపిఐ కార్యాలయంలో….సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, జిఎస్‌కె.అచ్యుతరావు, సిఎన్‌.క్షేత్రపాల్‌, పి.చంద్రశేఖర్‌, ఎస్‌కె.రెహమాన్‌ పాల్గొన్నారు.ఎస్‌యుసిఐ(సి) ఆధ్వర్యంలో…జివిఎంసి గాంధీ విగ్రహం దగ్గర ఎస్‌యుసిఐ(సి) ఆధ్వర్యంలో లెనిన్‌ శత వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి ఎస్‌.గోవిందరాజులు పాల్గొని లెనిన్‌ పోరాట వివరాలను తెలిపారు. కార్యక్రమంలో కె.అభిలాష్‌, బి.సంతోష్‌, రాంప్రభు, డి.విజ్ఞానంద్‌ పాల్గొన్నారు. అనకాపల్లి : మానవాళి విముక్తి కోసం మార్క్సిజాన్ని ఉపయోగించి, ప్రపంచ పీడిత ప్రజల జీవితాల బాగు కోసం పోరాడిన మహనేత లెనిన్‌ అనిసిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం కొనియాడారు. ఆదివారం సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి రామునాయుడు భవన్‌లో లెనిన్‌ శత వర్థంతిని పురస్కరించుకుని లెనిన్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో లోకనాథం మాట్లాడుతూ కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, దారిద్య్రం లేని సోషలిస్టు వ్యవస్థ సాధనకు కృషి చేసి సాధించిన గొప్ప ఆచరణవాదన్నారు. 1917లో రష్యా లో సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేసి, ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవాలు జయప్రదం కావటానికి బాటలు వేసిన చిరస్మరణీయుడన్నారు. అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆచరణలో రుజువు చేశారన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ దశలో ప్రజల సంపద కార్పొరేట్‌ పాలవుతున్న నేటి తరుణంలో యువత బంగారు భవిష్యత్తుకు దారీ చూపే భారతదేశ అభ్యున్నతికి, ప్రపంచానికి లెనిన్‌ సిద్ధాంతం మార్గదర్శకం అవుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా శ్రీరామ్‌, వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, సిపిఎం అనకాపల్లి మండల నాయకులు బి. ఉమామహేశ్వరావు, పెంటకోట శ్రీనువాసరావు, కె.తేల్లయ్యబాబు, కె.ఈశ్వరావు, కె.సుజాత, పి.చలపతి, జి.సురేష్‌, నూకఅప్పారావు పాల్గొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో…మనిషిని మనిషి దోచుకునే దోపిడీ వ్యవస్థను కూల్చి ప్రపంచంలోనే సోషలిస్టు వ్యవస్థను సోవియట్‌ యూనియన్‌లో నెలకొల్పి, అందరూ సమానంగా బతికే స్వేచ్ఛను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి లెనిన్‌ చిరస్మరణీయుడని సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ కొనియాడారు. అనకాపల్లి సిపిఐ కార్యాలయంలో వైఎన్‌. భద్రం అధ్యక్షతన లెనిన్‌ శత వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, తాకాసి వెంకటేశ్వరరావు, బుద్ధ వీరభద్రరావు, పెంటకోట నూక ప్రసాద్‌, కాండ్రేగుల శ్రీనివాసరావు, ఎంపీ రాజు, ఎం అప్పలరాజు, ఎన్‌ సత్యనారాయణ, వియ్యపు రాజు, వి .పోతురాజు, పెంటకోట వాసు పాల్గొన్నారు. రాంబిల్లి : ప్రపంచంలోనే మొట్టమొదటి కార్మిక రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు లెనిన్‌ అని సిపిఎం మండల శాఖ కార్యదర్శి జి దేముడునాయుడు అన్నారు. లెనిన్‌ శతవర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఎన్‌ నారాయణరావు, ఆర్‌ రాంబాబు, సిహెచ్‌ రామకృష్ణ, సిహెచ్‌ శివాజీ, ఎం శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, ధనరాజ్‌, గంగాధరరావు పాల్గొన్నారు.కె. కోటపాడు: మండలంలోని సూరెడ్డిపాలెం గ్రామంలో లెనిన్‌ శతవర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా నాయకులు గండి నాయన బాబు, తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయనబాబు మాట్లాడుతూ లెనిన్‌ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎర్ర దేవుడు. వనం సూర్యనారాయణ. వనం అప్పలనాయుడు. ఈర్లే నాయుడు బాబు. పద్మ. అప్పన్న పాల్గొన్నారు. ఉక్కునగరం : ప్రపంచ మానవాళి భవిష్యత్తుకు మార్గం చూపిన మహానేత లెనిన్‌ శత వర్థంతి సభను ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిపిఎం స్టీల్‌ జోన్‌ కమిటీ నాయకులు నమ్మి రమణ అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు లెనిన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దోపిడీ లేని సమాజం నిర్మించుకోవడమే కార్మిక వర్గ లక్ష్యమన్నారు. దీనికి కార్మిక వర్గమే నాయకత్వం వహించి దోపిడీ లేని కార్మిక రాజ్యాన్ని సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు స్టీల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి రామస్వామి, సిపిఎం స్టీల్‌ జోన్‌ కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️