నూకాంబిక సన్నిధిలో పవన్‌

Jun 10,2024 23:54 #JanaSena, #pavan
పవన్‌కు నూకాంబిక చిత్రపటాన్ని బహూకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా

ప్రజాశక్తి – అనకాపల్లి :

తాను పిఠాపురంలో గెలిచి ప్రమాణ స్వీకారం చేసే ముందు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి మొక్కులు తీర్చుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జనసేన అధినేత పవన్‌ ఆ మేరకు సోమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, కూటమి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పవన్‌ అనకాపల్లి వస్తున్నారన్న విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. తనను చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దని ఆయన చెప్పినట్టు భోగట్టా. అయితే పవన్‌ రాక విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, టిడిపి బిసి సాధికారత సమితి కన్వీనర్‌ మళ్ల సురేంద్ర, జనసేన నాయకులు మళ్ల శ్రీను తదితరులు హుటాహుటిన ఆలయానికి చేరుకుని పవన్‌ను కలిశారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆయనకు దుశ్శాలువా కప్పి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆళ్ల రామచంద్రరావు, గళ్ల కొండలరావు, బొడ్డేడ జోగినాయుడు, పోలవరపు త్రినాథ్‌, గొంతిన శ్రీనివాసరావు, వేగి గోపి, భానుచందర్‌, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పవన్‌ నూకాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఆలయానికి చేరుకోగా అప్పటికే ఆయన విశాఖకు వెళ్లిపోవడంతో వారంతా నిరుత్సాహపడ్డారు.

 

➡️