అంగన్‌వాడీల నిరసన’మోత’

Dec 26,2023 22:11

అనంతపురంలో ప్లేట్లు మోగించి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

       అనంతపురం కలెక్టరేట్‌ : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు నిరసనల మోత మోగించారు. ‘మా గోడు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వినపడాలి’ అంటూ ప్లేట్‌లు, గెరిటలతో శబ్ధం చేస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, కనీస వేతనాలు, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో అంగన్‌వాడీలు, సిఐటయు నాయకులు వినూత్న రీతిలో భిక్షాటన, మోకాళ్లపై నిలబడటం, మెడలో వేపాకు దండలు వేసుకోవడం లాంటి పద్ధతుల్లో నిరసన చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మెలో భాగంగా శిబిరం వద్ద రోడ్డుపై బైటాయించి ప్లేట్‌ను గెరిటలతో కొడుతూ శబ్ధం చేశారు. వీరి సమ్మెకు యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు మహ్మద్‌ జిలాన్‌, కిష్టప్ప, ఎపిటిఎప్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.సిరాజుద్ధీన్‌, శ్రీనాథ్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు రామాంజినేయులు, సిపిఎం నగర న్యూ కమిటీ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. న్యాయమైన హక్కుల సాధన కోసం అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్‌వాడీలకు వేతనాలు పెంపుదలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు జయభారతి, జమున, రూరల్‌ అధ్యక్షురాలు అరుణమ్మ, అర్భన్‌ కోశాధికారి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.

➡️