అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

అంగన్వాడీలకు సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి నల్లప్ప, ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం నగరంలోని జెవివి కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌తోపాటు ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజాసంఘాల నాయకులు అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కనీస వేతనం కోసం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, అధికార రాజకీయ వేధింపులు ఆపాలని ఏడురోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ విశిష్ట సేవలు చేస్తున్నా.. తగిన ఫలితం లేదన్నారు. సంవత్సరాలకొద్దీ సేవలు చేసినా రిటైర్‌మెంట్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా తొలగిస్తుందన్నారు. రాజకీయ నాయకులు, అధికారుల వేధింపులతో నిత్యం సతమతమవుతూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు చిన్న ఆంజనేయులు, శ్రీనివాసరావు, హరి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, రామాంజనమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తరిమెల గిరి, సిద్ధు, రాచేపల్లి సూర్యప్రకాష్‌, శివ, భీమా, సోము, తదితరులు పాల్గొన్నారు.

➡️