అదే పోరు.. ఆగేదే లేదు..!

సమ్మెలో భాగంగా అనంతపురంలో అంగన్‌వాడీలకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న చిన్నారులు, తల్లిదండ్రులు

      అనంతపురం కలెక్టరేట్‌ : సడలని సంకల్పంతో అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. కనీస వేతనాలు, ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. నిరసన ర్యాలీలు, భిక్షాటనలతో సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని విధాలుగా బెదిరింపులకు దిగుతున్నా బెదరకుండా ఆందోళనను నిర్వహిస్తున్నారు. ఇక అంగన్‌వాడీల సమ్మెను భగం చేయడంలో భాగంగా బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుని వాటి నిర్వహణను సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు బలవంతంగా తాళాలు పగులగొట్టి కేంద్రాలను తెరిచారు. కేంద్రాలను అయితే తెరిచారు గానీ, వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే సచివాలయ పనిభారంతో సతమతం అవుతున్న తాము ఈ అంగన్‌వాడీ కేంద్రం అదనపు పనులు చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెకు తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. అనంతపురం నగరంలో అంగన్‌వాడీలు, లబ్ధిదారులు, సిఐటియు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణకళామందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు నిర్వహించారు. అంగన్‌వాడీ పిల్లలు, స్థానిక మహిళలు, వీరి సమ్మెకు మద్దతుగా హాజరై ర్యాలీ చేపట్టారు. ‘జగన్‌మామయ్య అంగన్‌వాడీల వేతనాలు పెంచండి’ అంటూ పలకల్లో రాసుకుని చిన్నారులు ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో సిపిఎం నగర న్యూ కమిటీ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగమణి, నాగేంద్రకుమార్‌, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, రామాంజినేయులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాల్సింది పోయి బెదిరింపులతో సమ్మె విరమించాలని చూడటం దుర్మార్గంగా ఉందన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు, సచివాలయ ఉద్యోగులతో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించి భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మాత్రమే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున, నాయకులు అరుణ, జయభారతి, ప్రభావతి, పద్మావతి, రుక్మిణి, శాహినా, భవాని తదితరులు పాల్గొన్నారు.

➡️