అధికారుల ‘చెత్త’ నిర్ణయం..!

Jan 5,2024 08:51

తాడిపత్రిలో తమ సమ్మను విచ్ఛిన్నం చేసే చర్యలకు సాయం చేయొద్దంటూ పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న మున్సిపల్‌ కార్మికులు

         తాడిపత్రి : న్యాయమైన సమస్యల పరిష్కారం, హామీల అమలు కోసం మున్సిపల్‌ కార్మికుల చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు ‘చెత్త’ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అధికారులే కార్మికుల పొట్టేకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా పలు మున్సిపాల్టీల్లో ప్రయివేటు వ్యక్తులతో చెత్త తరలింపునకు యత్నిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి మున్సిపాల్టీల్లో గురువారం నాడు ప్రత్యామ్నాయం పేరుతో అధికారులు ఈ రకమైన చర్యలు చేపట్టారు. దీనిపై మున్సిపల్‌ కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు వ్యక్తుల ద్వారా చేపట్టిన చెత్త తరలింపును అడ్డుకున్నారు. తాడిపత్రిలో పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్టులు చేశారు. ఈ సమయంలో కార్మికులు పోలీసుల కాళ్లు పట్టుకుని ‘తమకు అన్యాయం చేయొద్దండి సారూ’ అంటూ కన్నీటితో వేడుకున్నారు. తాడిపత్రి మున్సిపాల్టీ పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న చెత్తను తొలగించేందుకు అధికారులు గురువారం నాడు ప్రయివేటు వ్యక్తులను తీసుకుని వచ్చారు. వాహనాల్లో చెత్తను తరలించేందుకు చర్యలు మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. చెత్త తరలింపు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ‘తాము న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నాం… దానిని పట్టించుకోకుండా ఇలా ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించి మా పొట్టకొట్టొద్దు’ అంటూ అధికారులను వేడుకున్నారు. మా కష్టాలను గుర్తించి సహకరించాలని కోరారు. కార్మికులు ఇంతలా ప్రాధేయపడినా అధికారులు వినలేదు. ఇదే సమయంలో ప్రయివేటు వ్యక్తులు చెత్త తరలింపునకు ఉపక్రమించడంతో కార్మికులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఒక్కసారిగా కార్మికులు ఆగ్రహావేశానికి లోనయ్యారు. చెత్తను తరలించేందుకు వీల్లేదంటూ అక్కడే బైటాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాళ్లు పట్టుకున్నా..

కనకరించని పోలీసులు..!

         తాడిపత్రి పట్టణంలో చెత్త తరలింపునకు వచ్చిన ప్రయివేటు వ్యక్తులు దూషించడంతో పాటు దాడికి యత్నించడంతో కార్మికులు ప్రతిఘటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కార్మికులతో ఏమాత్రం మాట్లాడకుండా ఏకపక్షంగా అరెస్టులకు ఉపక్రమించారు. ‘తమ గోడును వినండి సారూ’… అంటూ కార్మికులు పోలీసుల కాళ్లు పట్టుకున్నా వారు కనికరించలేదు. బలవంతంగా కార్మికులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లోకి విసిరేశారు. అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తమకు అన్యాయం చేసే చర్యలను ప్రోత్సహించొద్దంటూ పోలీసు స్టేషన్‌ వద్ద కార్మికులు మరోసారి పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినా పోలీసులు కనకరించలేదు.

అంగన్‌వాడీ, ప్రజాసంఘాల మద్దతు

           మున్సిపల్‌ కార్మికులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని అంగన్‌వాడీ, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఖండించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రజాసంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్‌ కార్మికులతో కలిసి పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. మహిళా కార్మికులపై దురుసుగా ప్రవర్తించిన ప్రయివేటు వ్యక్తులు నాగభూషణం, బాబులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వాస్తవాలను గుర్తించి కార్మికులకు న్యాయం చేయాలని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులతో కార్మికులతో మాట్లాడి వారిని శాంతిపజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కార్మికులకు వ్యతిరేకం కాదు అంటూనే మున్సిపల్‌ కార్మికుల ఉపాధి దెబ్బతీసేలా ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వం న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తే కార్మికులే స్వచ్ఛందంగా సమ్మెను విరమిస్తారన్నారు. అలా కాకుండా సమ్మెను విచ్ఛన్నం చేసేలా చర్యలు తీసుకుంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.

➡️