అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం తిప్పలు

అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం తిప్పలు

విద్యుత్‌ ఉపకేంద్రం ముందు సెల్ఫీ దిగుతున్న కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం

టిడిపి పాలనలో నియోజకవర్గంలో ఏడు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసి లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తే.. వైసిపి అధికారంలోకి వచ్చాక అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనాన్ని తిప్పలు పెడుతోందని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సెల్ఫీ ఛాలెంజిలో భాగంగా డి.హీరేహాల్‌ మండలంలోని ఓబుళాపురం గ్రామంలో టిడిపి హయాంలో నిర్మించిన 132/33 కెవి సబ్‌స్టేషన్‌ వద్ద సెల్ఫీ తీసుకుని వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాకమునుపు కరెంటు సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అన్నారు. అంతేగాకుండా వ్యవసాయ బోర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయేవారన్నారు. పట్టణంలో గార్మెంట్స్‌ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. అయితే టిడిపి అధికారంలోకి వచ్చాక తాను ఒక నిర్థిష్ట ప్రణాళికతో రైతులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 20 సంవత్సరాల పాటు రాయదుర్గంలో లోవోల్టేజీ సమస్య రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అయితే నాలుగున్నరేళ్ల వైసిపి ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో టిడిపికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

➡️