అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింహయ్య

ప్రజాశక్తి-రాయదుర్గం

త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేసి జగన్‌ను మరోసారి సిఎంను చేసుకుందామని వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింహయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాయదుర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి మెట్లు గోవిందరెడ్డి నివాసంలో ఎంపీ అభ్యర్థి శంకరనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైలా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపికలో మార్పులు, చేర్పులు చేశారన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు, గందరగోళ పరిస్థితి లేదన్నారు. గెలుపే అంతిమ లక్ష్యంగా, అధికారమే పరమావధిగా అభ్యర్థులు ఎవరైనా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపోతే ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం స్థానాల్లో తాను పోటీకి సిద్ధమని ప్రకటించడం బాధాకరమన్నారు. కాపు రామచంద్రారెడ్డికి పార్టీ మూడుసార్లు అవకాశం కల్పించిందన్నారు. ఎన్నికయ్యాక విప్‌ పదవి కూడా ఇచ్చారన్నారు. పార్టీని వీడి బయటకు వెళ్లిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అయినా చెల్లని రూకతో సమానం అన్నారు. శంకరనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్‌ నాలుగున్నరేళ్లలో గతంలో ఎవరూ అమలు చేయలేని సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి రూ.లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చారన్నారు. మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తాను పార్టీ, ప్రజలకు చేసిన సేవను గుర్తించి సీఎం జగన్‌ గుర్తించి ఇప్పటికే ఎపిఐఐసి అధ్యక్ష పదవిని ఇచ్చారన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పోరాళు శిల్ప, ఉపాధ్యక్షులు వలిబాష, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, నాయకులు శివప్ప, చిక్కన్న, మల్లికార్జున, ఉషారాణి, రాజగోపాల్‌రెడ్డి, నాగిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️