అరగుండు.. పొర్లుదండాలు..!

Jan 5,2024 21:56

అనంతపురం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గుండు గీయించుకుంటున్న మున్సిపల్‌ కార్మిక సంఘం నగర అధ్యక్షులు ఎర్రిస్వామి

          అనంతపురం కార్పొరేషన్‌ : ఎన్నికల హామీల అమలు, సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శనివారం నాడు అనంతపురం కార్పొరేషన్‌ ఎదుట మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు ఎర్రిస్వామి అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై కార్మికులు పొర్లుదండాలు పెట్టారు. సప్తగిరి సర్కిల్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు చర్చలు చేసినప్పటికీ ప్రధాన సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో జగన్‌ ఇచ్చిన వాగ్దాష్ట్రాలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమ్మెతో పట్టణాలు, నగరాల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితుల్లో అంటువ్యాధులు ప్రబలితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, నగర కార్యదర్శి తిరుమలేశు, ఎర్రిస్వామి, నల్లప్ప, ఓబుళపతి, రాయుడు, మల్లికార్జున, పోతులయ్య, మురళి, లక్ష్మీనరసింహ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️