ఆదిమరిస్తే మృత్యువాత

ఆదిమరిస్తే మృత్యువాత

పుట్లూరులో ప్రమాదకరంగా బ్రిడ్జి

ప్రజాశక్తి-పుట్లూరు

ఈ బ్రిడ్జిపై వెళ్లేటప్పుడు ఏమాత్రం ఆదమరిచినా మృత్యువాత పడాల్సిందే.. మండల కేంద్రంలోని హెచ్‌ఎల్‌సి కాలువపై ఏర్పాటు చేసిన రెండు బిడ్జిలకు ఇరువైపులా ఉన్న సైడ్‌వాల్వ్‌ కూలిపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బ్రిడ్జిలపై ప్రయాణించాలంటే వాహనచోదకులు, విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. గతంలో నాయకునిపల్లె వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన బ్రిడ్జిపై వెళ్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కాలువలో పడి మృతిచెందారు. మరోవైపు బ్రిడ్జిపై కస్తూరిబా బాలికల పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా ఆదర్శ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ బ్రిడ్జికి సైతం సైడ్‌ వాల్వ్‌ లేకపోవడంతో గతంలో కాలువలోకి ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు పడిన ఘటనలూ ఉన్నాయి. దీంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుముందే మేల్కొని బ్రిడ్జికి ఇరువైపులా సైడ్‌వాల్వ్‌లు కట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

➡️