ఆర్థిక బకాయిలు చెల్లించండి : యుటిఎఫ్‌

రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న యుటిఎఫ్‌ నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం నాడు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు చేపట్టే దీక్షలను యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప ముఖ్య అతిథిగా హాజరై దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగుల అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారన్నారు. సర్కార్‌ ఈ ఐదేళ్ల కాలంలో ఉద్యోగులకు చేసింది ఏమీ లేదన్నారు. ఉద్యోగులను వేధించడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వేతనాలను అమలు చేస్తామని ఉద్యోగుల వేతనాల్లో కోత విధించి ప్రభుత్వం చరిత్రకెక్కిందన్నారు. సిపిఎస్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయకుండా దుర్మార్గపూరితమైన జిపిఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఎన్నో పోరాటాల చేసి రద్దు చేయించుకున్న అప్రెంటీస్‌ విధానాన్ని మళ్లీ ఈ ప్రభుత్వం తీసుకురావడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అప్రెంటీస్‌ విధానాన్ని అమలు చేస్తే కలిసివచ్చే అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక బకాయిలు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షురాలు సరళ, జిల్లా కార్యదర్శి ప్రమీల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేంద్రమ్మ, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సుబ్బరాయుడు, నాగేంద్ర వెంకటనాయుడు, గంగాధర్‌, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️