ఆవులతో వెళ్తున్న కంటైనర్‌ బోల్తా

మృతి చెందిన ఆవులు

          పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్‌గేట్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 40 ఆవులతో వెళ్తున్న ఓ కంటైనర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. 35 ఆవులూ మృత్యువాత పడ్డాయి. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఎన్‌ఎల్‌1ఎన్‌2410 నెంబరు గల కంటైనర్‌ వాహనం కర్నూలు వైపు నుంచి బెంగుళూరుకు ఆవులు, ఎద్దులను తీసుకుని వెళ్తూంది. బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో కంటైనర్‌ పెద్దవడుగూరు మండలం కేసేపల్లి టోల్‌ప్లాజా వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డుపై నుంచి పల్టీలు కొడుతూ పక్కన ఉన్న పొలాల్లోకి పడింది. రాత్రి సమయం కావడంతో ప్రమాదాన్ని గుర్తించడంలో ఆలస్యం అయ్యింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే కంటైనర్‌లో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆవులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతి చెందిన వారిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు(43), విశాఖపట్నంకు చెందిన ఈశ్వరరావు(53)గా గుర్తించారు. వీరితో పాటు 35 ఆవులు, ఎద్దులు మృతి చెందాయి. వాహనం బోల్తా పడిన వెంటనే కంటైనర్‌లో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ పరారీ అయ్యారు. మూగజీవాలను ఎలాంటి అనుమతులు లేకుండా కబేళాలకు తరలిస్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

➡️