ఎన్నికల కమిషన్‌కు పోలింగ్‌ స్టేషన్ల ప్రతిపాదనలు

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

          అనంతపురం : జిల్లా నుంచి పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు ఈనెల మంగళవారం నాటికి పంపనున్నట్లు కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 2,213 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 23 సహాయక పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామన్నామన్నారు. 4 స్థానాల మార్పు. 85 కేంద్రాలకు పేర్లు మార్చేలా ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు. సహాయక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4 సహాయక పోలింగ్‌ కేంద్రాలు, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2, అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సహాయక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఈఆర్వోల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. 1,450 నుంచి 1,500 మధ్య ఓటర్లు ఉంటే సహాయక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపునన్నట్లు చెప్పారు. పోలింగ్‌ స్టేషన్ల స్థానాల మార్పు, పేర్ల మార్పు, సహాయక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి ఓటర్లకు విస్తత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రెండు రోజుల్లోపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు జెఎన్‌టియులో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ను పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. లిఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, ఈఆర్‌ఒలు జి.వెంకటేష్‌, రాణి సుస్మిత, వి.శ్రీనివాసులు రెడ్డి, కరుణకుమారితో పాటు వివిధ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️