ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్‌

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

          అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం నోడల్‌ అధికారులు, ఎఎల్‌ఎంటీలు వారికి కేటాయించిన విధులను నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సార్వత్రిక ఎన్నికల దష్ట్యా నోడల్‌ అధికారులు, ఎఎల్‌ఎంటీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జిల్లా పరిషత్‌ సిఇఒ వైఖోమ్‌ నిదియాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో నోడల్‌ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిబంధనలను తూచాతప్పకుండా పాటించాలన్నారు. ఎఎల్‌ఎంటీలు పిఒ పుస్తకాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదివాలన్నారు. అధికారులు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలన్నారు. ఈవీఎంలను సరైనరీతిలో భద్రపరచాలన్నారు. అనంతపురం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రంలో వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలని, ఈ విషయమై సంబంధిత ఆర్వో, డీఎస్పీలతో రిసెప్షన్‌ కేంద్రాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల విధులపై ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణకు సంబంధించి ప్రింటర్స్‌ను గుర్తించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ నీలమయ్య, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌ రావు, డిటిసి వీర్రాజుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️