ఏపీ.ఈసెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

విలేకరులతో మాట్లాడుతున్న ఏపీ. ఈసెట్‌ ఛైర్మన్‌ జివి.శ్రీనివాసరావు

          అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌-2024 నోటిఫికేషన్‌ గురువారం విడుదల అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం జెఎన్‌టియు ఉపకులపతి కాన్ఫరెన్స్‌ హాల్లో జెఎన్‌టియు ఉపకులపతి, ఏపీ.ఈసెట్‌ ఛైర్మన్‌ జివిఆర్‌.శ్రీనివాసరావు సెట్‌ కన్వనర్‌ పిఆర్‌.భానుమూర్తి తో కలిసి వెల్లడించారు. డిప్లొమా ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు, బీఎస్సీ గణితం ఉత్తీర్ణులైన వారు బీటెక్‌ బీ.ఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందడానికి నిర్వహించే ఏపీ.ఈసెట్‌-2024 బాధ్యతలను ఏపీ ఉన్నత విద్యామండలి జెఎన్‌టియుకు అప్పగించిందన్నారు. 2015 నుంచి 2021 వరకు ఏడుసార్లు ఈ పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. అందులో భాగంగా 2024లో కూడా జెఎన్‌టియు ఈ పరీక్షలను నిర్వహిస్తోందని తెలియజేశారు. ఏపీ.ఈసెట్‌ -2024 రాసే విద్యార్థులు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఎలాంటి రుసుం లేకుండా ఓసీ విద్యార్థులు రూ.600, బిసి విద్యార్థులు రూ.550, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 22 వరకు, రూ.2000 అపరాధ రుసంతో ఏప్రిల్‌ 29 వరకు, రూ.5 వేలు అపరాధ రుసుంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హల్‌టికెట్లు మే 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో డౌన్లోడ్‌ చేసుకోవచ్చని తెలియజేశారు. ఇక ఏపీ ఈసెట్‌ -2024 పరీక్ష మే 8 వతేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు అగ్రికల్చర్‌, బయోటెక్నలజీ, సెరామిక్‌ టెక్నాలజీ, బీఎస్సీ గణితం, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలు నుంచి సాయంత్రం 5.30 గంటలు మధ్య ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ట్స్‌మెంటేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు ఈ వివరాలను గుర్తించి పరీక్షలకు దరఖాసు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యమంలో రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, ఒటిపిఆర్‌ఐ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌, పిఆర్‌ఒ రామశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️