కదంతొక్కిన ఆశాలు

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పుతో నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలు, సిఐటియు నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : న్యాయమైన సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఆశాలు కదంతొక్కారు. హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 36 గంటల నిరసన దీక్షకు దిగారు.గురువారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరనసన ప్రారంభించి, వంటా వార్పు చేపట్టారు. రోడ్డుపైనే సహపక్తి భోజనం చేశారు. ఆశా కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, టిడిపి మహిళా విభాగం నగర అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్‌ ఏజి.రాజమోహన్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, టిఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నాగభూషణం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, మెడికల్‌ సేల్స్‌ రెప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు తదితరులు హాజరై మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ ఆశాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీస వేతనాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. గ్రామాల్లో బాలింతలు, గర్భిణీలు, చిన్న పిల్లలకు ఆశాలు సేవలు అందిస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మికుల హక్కులు కాలరాసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆశాలతో జాబ్‌ చార్ట్‌ కంటే అదనంగా పని భారాలు మోపుతోందన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాల్సిందే అన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో రాబోయే టిడిపి ప్రభుత్వంలో ఆశాల న్యాయమైన సమస్యల పరిష్కారానికి అధినేత చంద్రబాబుతో పోరాడుతామని సూచించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఆశాలు వంటా వార్పు కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటే పోలీసులతో ప్రభుత్వం అరెస్టులు, గృహ నిర్భందాలకు పాల్పడటం అన్యాయంగా ఉందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. ఆశా కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఆశాలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సెలవులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలను ఆశాలకు వర్తింపజేయాలన్నారు. కోవిడ్‌ కాలంలో మరణించిన ఆశాల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్‌గ్రేషియా ఇచ్చి, ఆ కుటుంబంలో ఒకరిని ఆశాగా తీసుకోవాలన్నారు.ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాల్లో ఆశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 36 గంటల దీక్షలు పూర్తయిన తరువాత ప్రభుత్వం స్పందన బట్టి మరో పోరాటానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శులు ముత్తుజా, వెంకటనారాయణ, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️