గుంతకల్లు రైల్వే డివిజన్‌ పేరు మార్పు తగదు

గుంతకల్లు రైల్వే డివిజన్‌ పేరు మార్పు తగదు

ఆందోళన చేస్తున్న విద్యార్థిసేన నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు

బ్రిటీష్‌ కాలం నాటి ఉన్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ పేరును మార్చవద్దని విద్యార్థిసేన నాయకులు డిమాండ్‌ చేశారు. రైల్వేబోర్డు గుంతకల్లు రైల్వే డివిజన్‌ పేరును మార్పు చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గురువారం రైల్వే జంక్షన్‌ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిసేన అధ్యక్షుడు అబ్దుల్‌భాసిద్‌ మాట్లాడుతూ గుంతకల్లు జంక్షన్‌ డివిజన్‌ పేరును బాలాజీ డివిజన్‌ పేరుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే వెనకబడిన రాయలసీమలో రాష్ట్ర విభజన అనంతరం రావాల్సిన రైల్వేజోన్‌ విశాఖపట్నానికి తరలించారన్నారు. ఇప్పుడు గుంతకల్లు డివిజన్‌ పేరును మార్చి బాలాజీ డివిజన్‌గా ఏర్పాటుకు చేయడాన్ని గుంతకల్లు ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. గుంతకల్లు పేరును ఎప్పటిలాగే ఉంచాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిసేన జిల్లా కార్యదర్శి మహేష్‌ గుప్తా, నాయకులు జయసింహా, సాయి, వీరన్న, మహబూబ్‌, సుందర్‌, సుధాకర్‌, రైల్వే ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️