చి’వరి’కి మోసమే..!

Jan 3,2024 09:11

సంచుల్లో నింపి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరిధాన్యం

                బొమ్మనహాల్‌ : ఆరుగాలం కష్టాలకోర్చి పంటను సాగు చేసిన రైతులు చి’వరి’లోనూ మోసపోతున్నారు. వర్షాభావం, సాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉన్నా, అన్నదాతలు కష్టాల నడుమ వరిపంటను సాగు చేశారు. రైతు కష్టానికి తగ్గట్టుగా పంట దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. మంచి ధరతో పంటను అమ్ముకోవచ్చని భావించిన రైతును దళారులు అడుగడుగునా దగా చేస్తున్నారు. స్థానికంగా మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో చేసేది లేక దళారులు ఎంత చెబితే అంత, ఎలా చెబితే అలా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంత కష్టం చేసిన చి’వరి’కి నష్టమే మిగులుతోందంటూ బొమ్మనహాల్‌ మండల వరి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బొమ్మనహాల్‌ మండలంలోని పలు గ్రామాల పరిధిలో తుంగభద్ర ఆయకట్టు కింద రైతులు వరి పంటను సాగు చేశారు. నీటి ఇబ్బందులున్నా ఉన్నా వాటిని ఎదుర్కొని పంటను పూర్తి చేశారు. దాదాపు 10 వేల ఎకరాల్లో సోనామసూరి, ఆరున్నర, నెల్లూరు సోనా తదితర రకాల వరిపంటను సాగు చేశారు. ప్రస్తుతం పంటను కోత కోసి అమ్మకాలు చేస్తున్నారు. ఇక్కడే దళారులు వారి మోసానికి తెరలేపుతున్నారు. తక్కువ తూకాలు, కనీస మద్దతు ధర ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనమసూరి వంద కిలోలను రూ.2800కు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.3000వేలుగా నిర్ణయించినా దళారులు, వ్యాపారులు ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదు. వివిధ కారణాలతో రూ.2800 మాత్రమే ఇస్తున్నారు. తూకాల్లోనూ మోసంవరిధాన్యం కొనుగోలులో తూకాల్లోనూ దళారులు మోసాలు చేస్తున్నారు. వరి ధాన్యాన్ని పెద్ద సంచుల్లో సేకరిస్తారు. ఇందులో 75 కిలోల వరి ధాన్యం పడుతుంది. ఈ 75 కిలోల సంచులన్నింటినీ లెక్కేసి దానిని క్వింటాళ్లలోకి మారుస్తారు. 75 కిలోల పది బస్తాలను రైతు నుంచి తీసుకుంటే దానిని 7.50 క్వింటాళ్లగా లెక్క గడతారు. ఇక్కడే దళారులు వారి మోసానికి తెరలేపుతారు. సంచి తూకం పేరుతో 2 కిలోలు, లాభం పేరుతో ఒక కిలో తీసేస్తారు. వంద కిలోలకు దాదాపు 5 కిలోల వరకు ఇలా వ్యాపారులు లెక్క నుంచి తీసేస్తారు. ఒక రైతు నుంచి 50 క్వింటాళ్లు వరి ధాన్యం సేకరిస్తే అందులో నుంచి సంచులు, లాభం పేరుతో 50 కిలోల వరకు తూకం నుంచి తీసేస్తారు. సాధారణంగా సంచి బరువు రెండు కిలోలు ఉండదని రైతులు చెబుతుంటారు. వ్యాపారులు మాత్రం దానిని ఆ తూకానికే లెక్కగడుతారు. దీని వల్ల రైతులు వంద కిలోలకు దాదాపు 5 కిలోలను నష్టపోవాల్సి వస్తోంది.

మార్కెట్‌సదుపాయం కరువు..!

స్థానికంగా ప్రభుత్వ మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు, దళారులు ఏ ధర నిర్ణయిస్తే దాని ప్రకారమే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మనహాల్‌ మండల రైతులు మార్కెట్‌కు వెళ్లాలంటే బళ్లారి లేదా రాయదుర్గం వెళ్లాలి. అంతదూరం వెళ్లలేని రైతులు వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తారో దానికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా మార్కెట్‌ సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు.

అప్పులతో పంట కొనుగోలు

వ్యాపారులు పంట కొనుగోలు తరువాత డబ్బులు కూడా ఇవ్వడం లేదు. అప్పుగానే రైతుల నుంచి తీసుకుంటున్నారు. రెండు నెలల తరువాత డబ్బులు ఇచ్చేలా ముందుగానే మాట్లాడుకుంటున్నారు. దీంతో రైతులు పంటను అమ్మేసినా డబ్బు కళ్లుజూడని పరిస్థితి ఉంది. గతేడాది కూడా ఇదే మాదిరి కొందరు వ్యాపారులు రైతుల నుంచి అప్పుకు పంటను కొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. దీనిపై రైతులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా రైతులకు న్యాయం జరగేలేదు. స్థానికంగా మార్కెట్‌ సదుపాయం లేక, ప్రభుత్వం పట్టించుకోకపోవడం తప్పని సరిపరిస్థితుల్లో అప్పునకే పంటను విక్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారులతో మోసం

వన్నూరప్ప, కురవల్లి గ్రామం,బొమ్మనల్‌ మండలం.

వరిధాన్యం కొనుగోలులో దళారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. వారి చెప్పిందే ధర.. తూచిందే తూకంగా ఉంటోంది. స్థానికంగా మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో దళారులకు పంటను విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దీనిపై స్పందించి స్థానికంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించి కనీస మద్దతు ధరతో వరి పంటను కొనుగోలు చేయాలి.

➡️