జగన్‌పై వాలంటీర్ల తిరుగుబాటు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం వద్దబైటాయించినిరసన తెలుపుతున్న వాలంటీర్లు

        హిందూపురం : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సొంత సైన్యంగా చెప్పుకునే వార్డు వాలంటీర్లు ఒక్కసారిగా ఆయనపై తిరుగుబాటు చేశారు. సమస్యలను పరిష్కరించాలని, తమను పొరుగు సేవల ఉద్యోగులుగా గుర్తించి, రూ 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట పట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పట్టణంలో మంగళవారం ఉదయం వాలంటీర్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. పట్టణంలోని ఎంజీఎం మైదానం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కమిషనర్‌ ఛాంబర్‌ ముందు బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడంలో తాము కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. కరోనా విపత్కర సమయంలో సైతం తాము ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుండి ప్రజలకు సేవలు అందించామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని చెప్పారు. ఇన్ని సేవలు చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచాకరం అన్నారు. తమ సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలన్నారు. పొరుగు సేవల ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాదిరి వాలంటీర్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైసిపి నాయకులు బెదిరింపులు… వెనక్కి తగ్గని వాలంటీర్లు…

హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద వాలంటీర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వైసిపి నాయకులు, కౌన్సిలర్లు వారిపై బెదిరింపులకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న వారికి నాయకులు స్వయంగా ఫోన్‌ చేసి అక్కడి నుంచి వెనక్కు రావాలని ఆదేశించారు. వాలంటీర్లు అధికార పార్టీ నేతల ఒత్తిడికి భయపడకుండా ఆందోళనను కొనసాగించారు.

➡️