జాగ్రత్తగా ఓటరుజాబితా రూపకల్పన

ఓటరు జాబితాపై ఈఆర్‌ఓలతో మాట్లాడుతున్న మురళీధర్‌రెడ్డి

అనంతపురం కలెక్టరేట్‌ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024లో భాగంగా ఓటరు జాబితాను అత్యంత జాగ్రత్తగా రూపొందించాలని ఎలక్షన్‌ రోల్‌ అబ్జర్వర్‌ డి.మురళీధర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024లో భాగంగా వివిధ అంశాలపై ఈఆర్‌ఓలు, జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్‌-6,7,8 క్లెయిమ్స్‌, అభ్యంతరాలకు సంబంధించి ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలన చేయాలన్నారు. దరఖాస్తుల విచారణలో తూచా తప్పకుండా ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలన్నారు. నియోజకవర్గం వారీగా 2 శాతం కన్నా అధికంగా తొలగింపులు, 4 శాతం కన్నా అధికంగా చేర్పులు ఉంటే అవి సరైనవిగా ఉన్నాయా లేదా అనేది పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి క్లెయిమ్స్‌, అభ్యంతరాలను విడదీయాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటును కూడా జాగ్రత్తగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఫామ్‌-6,7,8 దరఖాస్తులను ర్యాండమ్‌గా పరిశీలన చేశామన్నారు. మళ్లీ మరోసారి దరఖాస్తులను పున:పరిశీలిస్తామన్నారు. జిల్లాలో రెండు కిలోమీటర్ల లోపుగానే పోలీస్‌ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం నవోదయ కాలనీ పశుసంవర్ధక శాఖ కార్యాలయం పోలింగ్‌ బూత్‌ కేంద్రం, రుద్రంపేటలోని పొలింగ్‌ బూత్‌ కేంద్రాలకు వెళ్లి ఫారం-6, 7, 8 క్లెయిమ్స్‌పై పరిశీలన చేశారు. ఈ కార్యక్రమాల్లో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, ఈఆర్‌ఒలు గ్రంధి వెంకటేష్‌, రాణి సుస్మిత, సి.శ్రీనివాసులురెడ్డి, సుధారాణి, కరుణకుమారి, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ విశ్వనాథ్‌, తహశీల్దార్లు బాలకిషన్‌, శ్రీధర్‌మూర్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ భాస్కర్‌, డిప్యూటీ తహశీల్దార్‌ కనకరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ శామ్యూల్‌, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

➡️