జిల్లా సమగ్రాభివద్ధి కోసం ఐక్య ఉద్యమాలు : సిపిఎం

జిల్లా సమగ్రాభివద్ధి కోసం ఐక్య ఉద్యమాలు : సిపిఎం

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌

      అనంతపురం కలెక్టరేట్‌ : అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా సమగ్రాభివద్ధి కోసం కలిసి వచ్చే శక్తులతో ఐక్య ఉద్యమాలు నిర్మిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ తెలిపారు. బుధవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం జిల్లా శాఖా కార్యదర్శుల విస్తత సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనంతపురం జిల్లా వెనుకబడిందన్నారు. వరుస కరువులు వెంటాడుతున్నాయని, ఈ సంవత్సరం కూడా 28 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా వ్యవసాయ సాగు భూమిలో కేవలం 3.4 శాతం భూమికి మాత్రమే సాగు నీటి వసతి ఉందన్నారు. రాష్ట్రంలో అతి కనిష్టమన్నారు. వివిధ రకాల ఖనిజ వనరులు జిల్లాలో ఉన్నప్పటికీ పరిశ్రమలు స్థాపించలేదన్నారు. రకరకాల పండ్లు, కాయగూరలు, పూలు పండుతున్నాయని, వీటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ప్రభుత్వ విద్య పూర్తిగా బలహీనపడిందన్నారు. దీని వల్ల పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ వైద్యం పెరిగిపోతోందన్నారు. ఈ పరిస్థితుల వల్ల దళిత, గిరిజన, మైనారిటీ, బలహీనవర్గాలకు చెందిన అత్యధిక మంది పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో జిల్లా అభివద్ధి కోసం సిపిఎం రూపొందించిన ప్రత్యామ్నాయ విధానాలను విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కలిసి వచ్చే శక్తులు, వ్యక్తులతో ఉద్యమాన్ని నిర్మించడానికి కషి చేయాలని కోరారు. అందు కోసం ఈ నెల 14వ తేదీలోపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామని, 15 నుంచి 20వ తేదీ వరకు రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులకు, 30వ తేదీ లోపు ఎమ్మెల్యేలు, ఎంపీలకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు అర్జీలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, తరిమెల నాగరాజు, రామిరెడ్డి, భాస్కర్‌, కృష్ణమూర్తి, నాగమణి, వెంకటనారాయణ, ముస్కిన్‌, అచ్యుత్‌, మండల కార్యదర్శులు పోతులయ్య, చెన్నారెడ్డి, విరుపాక్షి, సూరి, శివశంకర్‌, దస్తగిరి పాల్గొన్నారు.

➡️