టిడిపికి మాజీ వైస్‌ఛైర్మన్‌ రాజీనామా

రాజీనామా పత్రాన్ని చూపిస్తున్న జిలాన్‌ భాష

 

ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌

తాడిపత్రి టిడిపి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ వైస్‌ఛైర్మన్‌ బిఎండి జిలాన్‌బాషా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని చింతల వెంకటరమణస్వామి ఆలయ ఛైర్మన్‌ కందికాపుల మురళి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లుగా టిడిపిలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి హోదా వరకూ పని చేసి తాడిపత్రిలో ఉన్న జెసి టిడిపిలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సేవ్‌ తాడిపత్రి నినాదంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి టిడిపిలో రాక ముందు నుంచి తాము ఉన్నామన్నారు. ఒక పార్టీ ఇన్‌ఛార్జిగా ఎంతసేపూ కొడుకును గెలిపించుకోవాలనే తపన తప్ప పార్టీ కోసం పని చేయాలని ఆయనకు లేదన్నారు. ఆఖరికి చంద్రబాబు జైల్లో ఉన్నా ఎక్కడా నిరసనగానీ, దీక్షగానీ చేసిన పాపానపోలేదన్నారు. ఇక్కడ ఛైర్మన్‌గా ఉండి హైదరాబాదులో ఉంటున్నారన్నారు. కేవలం ఒక ఎలక్ట్రికల్‌ వాహనంలా బ్యాటరీ ఛార్జింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లి ఛార్జింగ్‌ చేసుకునేలా మారాడని ఆరోపించారు. అంతేగాకుండా ఏమాత్రం అర్హత లేనివారితో ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి అధికారంలో ఉన్న నాయకులు, ప్రభుత్వాన్ని తిట్టించడమే రాజకీయం అనుకుంటున్నారన్నారు. జెసి ప్రభాకర్‌రెడ్డికి టిడిపిని లీజుకు తీసుకున్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఒకప్పుడు తాడిపత్రికి రావాలంటే జెసి వీసా తీసుకుని తాడిపత్రిలో అడుగుపెట్టేలా ఉండేదన్నారు. కానీ పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక అందరూ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారన్నారు. తాడిపత్రిలో జెసి ప్రభాకర్‌రెడ్డి గెలిచే అవకాశం లేదని, 2024లో కూడా 2019 మాదిరే రిపీట్‌ అవుతుందన్నారు. తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయ ఛైర్మన్‌ కందికాపుల మురళి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధికి జెసిపి అడుగడుగునా అడ్డు పడుతున్నాడన్నారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు కానీ, వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో కానీ, జూనియర్‌ కళాశాల ప్రహరీ నిర్మాణంలో కానీ అడ్డుకోవడమే పనిగా పెట్టుకుని తాడిపత్రి ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒకప్పుడు టిడిపిలో అన్నదమ్ముల్లా పనిచేసిన వారంతా జెసి చేసే రాచరిక పాలన భరించలేక వీడుతున్నారన్నారు. ఇప్పటికైనా మీరు మారి తాడిపత్రి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచేలా ఆలోచన చేయాలని జెసికి సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ డివి కుమార్‌, ఆయూబ్‌ పాల్గొన్నారు.

➡️