తమ్ముళ్ల తగాదాలు..!

తమ్ముళ్ల తగాదాలు..!

     అనంతపురం ప్రతినిధి : ఎన్నికలు ముంచుకొస్తున్నా తమ్ముళ్ల మధ్య తగవులు వీడటం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల గ్రూపు తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి 2019 ఎన్నికలకు ముందు కూడా ఉండేవి. వీటి నడుమే ఓటమిని చవి చూసింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో టిడిపి ఓటమి చెందింది. రెండు పార్లమెంటు స్థానాలనూ కోల్పోయింది. ఇంతటి గడ్డు పరిస్థితులను టిడిపి ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఈ ఫలితాల తరువాత అయినా నేతల్లో మార్పు వచ్చి ఏకతాటిపైకొస్తారనుకుంటే అదీ లేదు. ఇప్పటికీ అవే విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమన్వయం చేసేందుకు పలుమార్లు అధిష్టానం తీసుకున్న చర్యలు కూడా ఫలించలేదు. ఒకవైపు అధికార వైసిపి ఇప్పటికే ఎన్నికలకు సమయత్తమయ్యే పనిలోనుంది. ఎక్కడైనా నేతల మధ్య విభేదాలున్నా వాటిని సమన్వయపరిచే బాధ్యతలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నారు. ఇప్పటికే సగం నియోజకవర్గాలకు అభ్యర్థులను వైసిపి ప్రకటించి ఎన్నికలకు అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. తెలుగుదేశం పార్టలో ఇప్పటికీ నియోజకవర్గాలపై స్పష్టత లేదు. టికెట్టు కోసం నాయకులు మాత్రం పెద్ద ఎత్తునే పోటీపడుతున్నారు. గ్రూపులు నడుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా చూస్తే కళ్యాణదుర్గంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. 2019 ఎన్నికల ముందు నుంచి ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వులోనూ టుమెన్‌ కమిటీకి, బండారు శ్రావణికి మధ్య తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయదుర్గంలో అనంతపురం టిడిపి జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిల మధ్య పొసగడం లేదు. మడకశిర ఎస్సీ రిజర్వులోనూ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిల మధ్య విభేదాలు తారా స్థాయిలోనే నడస్తున్నాయి. ఒకరినొకరు సహరించుకునే పరిస్థితి లేదు. కదరిలో కందికుంట వెంకట ప్రసాద్‌, చాంద్‌బాషాల మధ్య ఇప్పటికీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెనుకొండలో సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారధి, సబితాల మధ్య పోరు నడుస్తోంది. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు ఖరారు చేసినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. వీటి నడుమ త్వరలో వచ్చే ఎన్నికలకు ఏ రకంగా సమయత్తమవుతుందన్న సందేహాలున్నాయి. టిడిపి బలమైన క్యాడర్‌ ఉన్నా నేతల మధ్య విభేదాలతో వారు కూడా ఏ రకంగా పనిచేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లోనున్నారు. నేడు చంద్రబాబు ‘రా కదలిరా’ కార్యక్రమంలో ఉరవకొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి కూడా ఇక్కడే బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేతలతో మాట్లాడే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఆ సమయంలో నియోజకవర్గాల నేతలతోనూ మాట్లాడి కొంతవరకు దిశానిర్ధేశం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

నేడు చంద్రబాబు పర్యటన

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం ఉరవకొండలో జరిగే ‘రా కదలిరా’ కార్యర్రకమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ఉరవకొండకు ఆయన చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఇక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో నెల్లూరు జిల్లాకు వెళ్తారు.

➡️